super man: ఇంటర్నెట్ సెన్సేషన్ గా ‘బ్రెజిల్ సూపర్ మ్యాన్’

  • ఒకప్పటి హాలీవుడ్ ‘సూపర్ మ్యాన్’ హీరో క్రిస్టోఫర్ రీవ్ ను పోలిన రూపంతో నెటిజన్ల ఫిదా
  • సూపర్ మ్యాన్ కాస్టూమ్ లో కనిపిస్తూ అందరినీ నవ్విస్తున్న లియొనార్డో మయులెర్ట్

the brazilian super man

బ్రెజిల్ కు చెందిన లియొనార్డో ముయలెర్ట్ అనే 36 ఏళ్ల లాయర్ కొంతకాలంగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయాడు. బ్రెజిల్ సూపర్ మ్యాన్ గా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్నాడు. సుమారు ఏడాది వ్యవధిలోనే అతని జీవితం కాస్తా సాధారణం నుంచి అసాధారణంగా మారిపోయింది.

ఏం జరిగిందంటే..

లియొనార్డో 2022లో తన స్నేహితురాలితో కలిసి విహార యాత్రలో భాగంగా సావో పాలోలో జరిగిన కామిక్ కాన్ కన్వెన్షన్ కు హాజరయ్యాడు. అక్కడ లియొనార్డోను చూసిన ఓ అపరిచితుడు అతను అచ్చం 1970ల నాటి హాలీవుడ్ మూవీ ‘సూపర్ మ్యాన్’ హీరో క్రిస్టోఫర్ రీవ్ ను పోలి ఉన్నట్లు గుర్తించాడు. దీంతో అతనికి తెలియకుండానే సెల్ ఫోన్ లో వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు. 

ఆ వీడియోకు వెంటనే వేలాది వ్యూస్ రావడంతో అందరూ అతన్ని బ్రెజిల్ సూపర్ మ్యాన్ గా పిలవడం మొదలు పెట్టారు. అయితే విచిత్రం ఏమిటంటే ఆ సమయానికి లియొనార్డోకు కనీసం సోషల్ మీడియాలో అకౌంట్ కూడా లేకపోవడం. కొన్ని వారాల తర్వాత లియొనార్డో తన స్నేహితుల ద్వారా తాను ఆన్ లైన్ లో “ది బ్రెజిలియన్ సూపర్‌మ్యాన్” సంచలనంగా మారినట్లు తెలుసుకున్నాడు. "నేను సూపర్‌మ్యాన్‌లా కనిపిస్తున్నానని చాలా మంది అనుకుంటున్నారని చదవడం చాలా ఫన్నీగా అనిపించిందని అతను ఏఎఫ్ పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పాడు.

మదిలో ఆలోచన

అప్పుడే లియొనార్డోకు మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అందరూ తనను సూపర్ మ్యాన్ గా భావిస్తున్నప్పుడు అలాగే ఎందుకు కనిపించకూడదని అనుకున్నాడు. వెంటనే సూపర్ మ్యాన్ కాస్టూమ్స్ ను ఆన్ లైన్ లో కొనుక్కొని వేసుకోవడం మొదలుపెట్టాడు. 

సేవా భావంతో ముందుకు..
లియొనార్డో బ్రెజిల్ మొత్తం సూపర్ మ్యాన్ డ్రెస్ లో తిరుగుతూ అందరినీ నవ్విస్తున్నాడు. స్కూళ్లు, హాస్పిటళ్లు, చారిటీ సంస్థలను ఉచితంగా సందర్శిస్తున్నాడు. వీధుల్లో తిరిగే వారికి సరదాగా పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతను సూపర్ స్టార్ గా మారిపోయాడు. అతని వీడియోలను గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ గన్ తోపాటు మరికొందరు ప్రముఖులు రీపోస్ట్ చేశారు.

గర్ల్ ఫ్రెండ్ సాయం
సూపర్ మ్యాన్ గెటప్ లో అతను చేసే సరదా వీడియోలను లియొనార్డో గర్ల్ ఫ్రెండ్ హెలినెస్ శాంటోస్ షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. అలాగే అతని షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తోంది. రియో డీ జెనేరియోలోని ఓ హాస్పిటల్ ను ఇటీవల సందర్శించిన లియోనార్డో తన గెటప్ తో అక్కడున్న రోగుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించాడు. అలాగే తనను చూసి ముచ్చటపడిన హాస్పిటల్ స్టాఫ్ తో సెల్ఫీలు దిగాడు. రోజువారీ పనుల నుంచి కాస్త విరామం తీసుకొనేందుకు, కొత్త శక్తితో తిరిగి పని చేసేందుకు అతని రాక ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పుకొచ్చారు.

లాయర్ గా సేవలు
సెలవులు లేని రోజుల్లో మాత్రం లియొనార్డో తన లాయర్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. బ్రెసీలియాలో పౌర హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. “రోజూ గంటల తరబడి పనిచేయడం వల్ల అలసట కలుగుతున్నా సోషల్ మీడియాలో నా గెటప్ ను చూసి యూజర్లు పెట్టే కామెంట్లు నేను నిరంతరం ముందుకెళ్లేలా ప్రోత్సహిస్తుంటాయి” అని లియొనార్డో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News