Raheel Aamir: రాహిల్ మెడచుట్టూ బిగుసుకుంటున్న జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు.. నాడు కూడా పోలీసులే తప్పించారా?

  • గతేడాది డిసెంబరులో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా రాహిల్
  • రెండేళ్ల క్రితం నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులోనూ అతడిని నిందితుడిగా చేర్చిన పోలీసులు
  • తనను బలవంతంగా ఇరికించారని వాపోయిన ఆఫ్రాన్
  • నాడు కారు నడిపింది రాహిలేనని వాంగ్మూలం
  • రాహిల్‌ను తప్పించడం వెనక నాటి పోలీసు అధికారుల హస్తంపై ఆరా
Jubilee Hill Road Accident Case Tighten Around Raheel Aamir Neck

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ చుట్టూ మరో కేసు బిగుసుకుంటోంది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును తిరగదోడుతున్న పోలీసులు ఆ కేసులో రాహిల్‌ను నిందితుడిగా చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది రాహిలేనని నిర్ధారించుకుని తాజాగా అతడిని నిందితుడిగా చేర్చారు. సెక్షన్లు మార్చి తిరిగి దర్యాప్తు మొదలుపెట్టారు.

17 ఫిబ్రవరి 2022న రాత్రి 8 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద డివైడర్ దాటుతున్న కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా చిన్నారి రణవీర్ మృతి చెందాడు. బాధితులు మహారాష్ట్రకు చెందిన వారు. చెక్‌పోస్టు వద్ద బెలూన్లు, స్ట్రాబెర్రీలు అమ్ముకుని జీవిస్తుంటారు. వారిని ఢీకొట్టిన తర్వాత కారులో ఉన్న ముగ్గురు యువకులు పరారయ్యారు. కారుపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. 

రాహిల్ స్థానంలో ఆఫ్రాన్
పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తానేనని ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ సమయంలో తనతోపాటు రాహిల్, స్నేహితుడు మహమ్మద్ మాజ్ ఉన్నట్టు చెప్పడంతో వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. స్టీరింగ్‌పై ఆఫ్రాన్ వేలిముద్రలు కూడా సరిపోలినట్టు పోలీసులు అప్పట్లో ప్రకటించారు. 

గతేడాది డిసెంబర్‌లో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్‌ను గుర్తించిన పోలీసులు ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలోనూ రాహిల్ స్థానంలో మరొకరిని ఇరికించే ప్రయత్నంలో పలువురు పోలీసు అధికారులు సస్పెండయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కారు ప్రమాదం తెరపైకి వచ్చింది. 

బలవంతంగా ఒప్పించారు
అప్పుడు కూడా రాహిల్ తన స్థానంలో ఆఫ్రాన్‌ పరారై తన స్థానంల్‌ ఆఫ్రాన్‌ను చేర్చినట్టు అనుమానించిన పోలీసులు.. రాహిల్ స్నేహితుడు మహమ్మద్ మాజ్, బాధితురాలు కాజల్ చౌహాన్‌ను తదితరులను పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు కారు నడిపింది రాహిలేనని వాంగ్మూలంలో ఆఫ్రాన్ అంగీకరించాడు. అంతేకాదు, తానే కారు నడిపినట్టు అంగీకరించాలంటూ బలవంతంగా తనను ఒప్పించారంటూ వాపోయినట్టు తెలిసింది. దీంతో కేసుపై సీరియస్‌గా దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు.. నాడు పనిచేసిన పోలీసు అధికారుల పాత్ర, ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

More Telugu News