IPL 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బట్లర్.. అడుగు దూరంలోనే కోహ్లీ రికార్డు

  • 7 సెంచరీలతో ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచిన బట్లర్
  • 6 సెంచరీలతో 3వ స్థానానికి పడిపోయిన క్రిస్ గేల్
  • 8 శతకాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి చేరువయ్యేందుకు అడుగుదూరంలోనే బట్లర్
Jos Buttler breaks Chris Gayles record to smash his 7th IPL century

మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వీరోచిత శతకం బాది రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించి స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. కోల్‌కతాపై తాజా సెంచరీతో ఐపీఎల్‌లో మొత్తం ఏడు శతకాలను బట్లర్ పూర్తి చేసుకున్నాడు. దీంతో క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో 6 సెంచరీలు బాదిన గేల్ మూడవ స్థానానికి పడిపోయాడు. బట్లర్ కంటే ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. విరాట్ పేరిట ఐపీఎల్‌లో 8 సెంచరీలు ఉన్నాయి. బట్లర్ మరొక్క శతకం సాధిస్తే అతడు కోహ్లీతో సమంగా నిలవనున్నాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరులు..
1. విరాట్ కోహ్లీ - 8 (244 మ్యాచ్‌లు)
2.  జాస్ బట్లర్ - 7 (102 మ్యాచ్‌లు)
3. క్రిస్ గేల్ - 6 (142 మ్యాచ్‌లు)
4. కేఎల్ రాహుల్ - 4 (124 మ్యాచ్‌లు)
5. డేవిడ్ వార్నర్ - 4 (182 మ్యాచ్‌లు)
6. షేన్ వాట్సన్ - 4 (145 మ్యాచ్‌లు)

ఇక టీ20 ఫార్మాట్‌లో బట్లర్‌కు మొత్తం 8 సెంచరీలు ఉన్నాయి. సెంచరీలు అన్నీ తన జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లోనే రావడం విశేషం.

టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల వీరులు
1. క్రిస్ గేల్ - 22 
2. బాబర్ ఆజం - 11 
3. విరాట్ కోహ్లీ - 9
4. డేవిడ్ వార్నర్ - 8 
5. మైఖేల్ క్లింగర్ - 8
6. ఆరోన్ ఫించ్ - 8
7. రోహిత్ శర్మ - 8 
8. జాస్ బట్లర్ - 8.

కాగా గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ వీరోచిత శతకం సాధించాడు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో 60 బంతుల్లో 107 పరుగులు బాదాడు. తొలుత 33 బంతుల్లో 42 పరుగులు రాబట్టిన బట్లర్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. 22 బంతుల్లో 62 పరుగులు జోడించి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

More Telugu News