YS Viveka Murder Case: అవినాశ్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఇదే: సునీత

  • వివేకా హత్య కేసులో సునీత × అవినాశ్ రెడ్డి
  • నిన్న మీడియా సమావేశంలో అవినాశ్ కాల్ డేటా ప్రదర్శించిన సునీత
  • ఇవాళ సునీతపై తీవ్ర విమర్శలు చేసిన అవినాశ్ రెడ్డి
  • అవినాశ్ తన ఫోన్ ను సీబీఐకి అప్పగించాలని సునీత సలహా 
Suneetha says Avinash Reddy should handover his phone to CBI

వివేకా హత్య కేసు వ్యవహారంలో డాక్టర్ సునీతారెడ్డికి, ఎంపీ అవినాశ్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న మీడియా సమావేశంలో సునీత చేసిన వ్యాఖ్యలకు అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, సునీత మరోసారి మీడియా ముందుకొచ్చారు. అవినాశ్ రెడ్డికి ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. అవినాశ్... మీ ఫోన్ ను సీబీఐ వాళ్లకు అప్పగించండి... మీరు కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారు అంటూ సునీత స్పష్టం చేశారు. 

గూగుల్ టేకౌట్ కల్పితం అంటూ అవినాశ్ అంటున్నారని, గూగుల్ టేకౌట్ రిపోర్టును రూపొందించింది సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్ అని సునీత వెల్లడించారు. ఈ సంస్థలకు అవినాశ్ పై ఏమైనా కోపం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

"గూగుల్ టేకౌట్ చెబుతున్న దాని ప్రకారం... అవినాశ్ రెడ్డి ఇంట్లో గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వివేకా మృతి గురించి తెలిసిన వెంటనే జగన్ కు ఏమని చెప్పారు? గుండెపోటు అన్నారా, లేక హత్య అని చెప్పారా? హత్య అని చెప్పి ఉంటే జగన్ వెంటనే డీజీపీకి ఫోన్ చేయాలి కదా! సిట్ దర్యాప్తులో అర్థం పర్థం లేని వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. దాంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. సాక్షులు చనిపోతుండడంతో ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు" అని సునీత వివరించారు. 

"నాడు ఘటన స్థలంలో శివప్రకాశ్ రెడ్డి లేనే లేరు. ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా కాకమ్మ కబుర్లు వినిపిస్తున్నారు. చివరి రోజుల్లో మేం వివేకాను వదిలేశాం అని ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే... నా భర్త రాజశేఖర్ రెడ్డి, వివేకా కలిసి కొరియా పర్యటనకు ఎలా వెళ్లారు?" అని ప్రశ్నించారు. 

ఇక, ఈ కేసులో అప్రూవర్ అయినంత మాత్రాన దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదని సునీత స్పష్టం చేశారు.

More Telugu News