Arvind Kejriwal: గుజరాత్‌లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, భార్య సునీతా కేజ్రీవాల్

  • 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • జాబితాలో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరుల పేర్లు
  • గుజరాత్‌లోని 26 లోక్ సభ స్థానాలకు 2చోట్ల పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ
Jailed Arvind Kejriwal and Wife Among AAP Star Campaigners In Gujarat

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ పేర్లతో పాటు సీఎం భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పేర్లనూ చేర్చింది. మొత్తం 40 మందితో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు వారి పేర్లను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.

ఈ జాబితాలో ఉన్న మిగతా ప్రముఖుల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ ఉన్నారు. మరో ఇద్దరు ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు ఈ జాబితాలో లేవు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ గత నెల 21న అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు.

గుజరాత్‌లోని 26 లోక్ సభ స్థానాలు ఉండగా మిత్రపక్షం కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావ్‌నగర్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచింది. బరూచ్‌ నుంచి చైతర్‌ వాసవ, భావ్‌నగర్‌ నుంచి ఉమేష్‌ మక్వానాను ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది. గుజరాత్‌లో లోక్ సభ ఎన్నికలు మే 7న ఒకే దశలో జరగనున్నాయి. నామినేషన్ పత్రాల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19.

More Telugu News