Errabelli: బీజేపీ త్వరలో తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడుతుంది: ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli Dayakar Rao says bjp will demolish telangana government
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్న ఎర్రబెల్లి
  • కాంగ్రెస్ పాలనలో రియాల్టీ బిజినెస్ దెబ్బతిందన్న మాజీ మంత్రి
  • కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్
  • కడియం శ్రీహరి చరిత్ర బయటపెడతానని హెచ్చరిక
బీజేపీ త్వరలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. కడియం శ్రీహరి చరిత్ర అంతా బయటపెడతానని హెచ్చరించారు. ఒక్క పథకం కూడా అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పీడించి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతిందన్నారు. ఆర్టీసీ దివాలా తీయడం ఖాయమన్నారు.

కడియం శ్రీహరికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ చేశారు. తనను ఓడించిన పాపానికి పాలకుర్తి ప్రజలు ఏడుస్తున్నారన్నారు. రాజకీయాల్లో కడియంను మించిన ద్రోహి లేడని మండిపడ్డారు. ఉద్యమం సమయంలోనూ ఏడుసార్లు గెలిచిన చరిత్ర తనదే అన్నారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన తనను పట్టుకొని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కడియం నాలుగుసార్లు ఓడిపోయాడని... ఇంకా తన గురించి మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. అసలు ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? అని ప్రశ్నించారు.
Errabelli
BRS
Telangana

More Telugu News