Revanth Reddy: గల్ఫ్ సహా విదేశాలకు వెళ్లే కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

CM Revanth Reddy good news for gulf workers
  • విదేశాలకు వెళ్లే వారి కోసం కొత్త విధానం తీసుకు రాబోతున్నామన్న రేవంత్ రెడ్డి
  • ఓవర్సీస్ కార్మికుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడి
  • రైతు బీమా మాదిరి గల్ఫ్ కార్మికుల బీమాను ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకు రాబోతుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ గల్ఫ్ అండ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా ఈ వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటయ్యే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తెలంగాణలో పదిహేను లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నట్లు చెప్పారు.

ఓవర్సీస్ కార్మికుల కోసం పిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం ఉందని, ఈ విషయంలో ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు చెప్పారు. రైతుబీమా మాదిరి రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల బీమాను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. విదేశాల్లో తెలంగాణ బిడ్డలు ఇబ్బందుల్లో ఉంటే సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమంతో పాటు ఇక్కడి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసమూ తమ ప్రభుత్వం ఆలోచన చేయనుందన్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News