NDA Alliance: ఈసీని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు

  • ఈసీ వద్దకు వెళ్లిన అరుణ్ సింగ్, కనకమేడల, నాదెండ్ల, జీవీఎల్
  • ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు
  • కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ 
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని వినతి
NDA Alliance leaders met ECI and complains against AP Govt

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహారావు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలిపారు. కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, విపక్ష నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి వివరించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఏపీలోని సమస్యాత్మక పోలింగ్ బూత్ లలో వీడియో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం బీజేపీ నేత అరుణ్ సింగ్ మాట్లాడుతూ, ఏపీ డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ డీజీపీ వైసీపీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నారని, వారు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారన్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు అనేక ఫిర్యాదులు చేశారని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. 

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మూడు పార్టీల నేతలం ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిసి కొన్ని నివేదికలు అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో క్షీణించాయని, సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ లేదన్న విషయాన్ని ఈసీకి వివరించామని తెలిపారు. 

చంద్రబాబుపైనా, పవన్ కల్యాణ్ పైనా చాలా ప్రాంతాల్లో కావాలనే రాళ్ల దాడులు చేయిస్తున్నారన్న విషయాన్ని ఈసీకి తెలియజేశామని చెప్పారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, సీఎస్ ల పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్టు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

ఓటరు లిస్టు అక్రమాలపై జాగ్రత్తగా పరిశీలన చేపట్టాలని ఈసీని కోరామని చెప్పారు. అధికారం కోల్పోతామన్న భయంతో జిల్లాల్లో కిందిస్థాయి అధికారులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో చంద్రబాబు ఇప్పటికే పలు లేఖలు రాశారని వివరించారు. ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతం అని నాదెండ్ల స్పష్టం చేశారు. 

టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ఇవాళ ఎన్డీయే నేత అరుణ్ సింగ్ నేతృత్వంలో తాము ఎన్నికల సంఘాన్ని కలిశామని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కూడా కలిసి ఏపీలో పరిస్థితులను వివరించామని వెల్లడించారు. ఏపీ సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఈసీకి నివేదించామని చెప్పారు. 

ఎన్నికల షెడ్యూల్  వచ్చాక కూడా సీఎస్ తనకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చిన వైనాన్ని, సీఈవోను కూడా తన వద్దకు పిలిపించుకుని సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరును ఈసీకి వివరించామని కనకమేడల తెలిపారు. 

డీజీపీ పోలీసు బలగాన్నంతా తన నియంత్రణలో ఉంచుకుని, ప్రధాని హాజరైన సభకు కూడా సరైన బందోబస్తు కల్పించకుండా, ప్రోటోకాల్ చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విషయాన్ని ఈసీకి తెలియజేశామని అన్నారు.

More Telugu News