Dr K Laxman: పూర్తిగా ధ్వంసమైన కారును రేవంత్ రెడ్డి జాకీ పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు: డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా

  • రైతులకు పంట బోనస్ ఇవ్వలేదని... అడిగితే వచ్చే సీజన్ అంటున్నారని విమర్శ
  • హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్న
  • అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఒక్క కేసులోనైనా ఎవరినైనా శిక్షించిందా? అని నిలదీత
K Laxman alleges Revanth Reddy trying to lift brs

తెలంగాణలో కారు పూర్తిగా ధ్వంసమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు పంటపై బోనస్ ఇవ్వడం లేదని, అడిగితే వచ్చే సీజన్ అంటున్నారని విమర్శించారు. ఇలా చెప్పడానికి ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే... మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని ధ్వజమెత్తారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసం, కుట్రలు అని మండిపడ్డారు. మరోసారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. హామీలు నెరవేర్చనందుకు మీకు ఓటు వేయాలా? అని నిలదీశారు.

కాళేశ్వరం, మేడిగడ్డ, ధరణి, డ్రగ్స్ కేసు, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్‌పై అవినీతి ఆరోపణలు చేశారని... కానీ ఒక్క కేసులోనైనా శిక్షించడానికి చర్యలు తీసుకున్నారా? అన్నారు. బీఆర్ఎస్ నేతలు అవినీతిపరులు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి లబ్ధి పొందారని... ఇప్పుడు గులాబీ పార్టీ పూర్తిగా చతికిలపడిందన్నారు.

More Telugu News