rbi: అక్టోబర్ 1 నుంచి లోన్ ఫీజులన్నీ ముందే వెల్లడించాలి: ఆర్బీఐ

  • బ్యాంకుల పారదర్శకత పెంచేలా కీలక నిర్ణయం
  • అన్ని రకాల రిటైల్, ఎంఎస్ ఎంఈ టర్మ్ లోన్లకు వర్తింపు
  • తొలిసారి వెల్లడి కానున్న ఏపీఆర్ వివరాలు
Disclose all loan fees upfront from Oct 1

ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి రుణగ్రహీతలకు కీలక అంశాలతో కూడిన స్టేట్ మెంట్ ను అందించాలని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. సాధారణ రుణ సమాచారంతోపాటు అన్ని రకాల చార్జీల వివరాలు, వార్షిక రుణ వ్యయాన్ని ఆ స్టేట్ మెంట్ లో పేర్కొనాలని స్పష్టం చేసింది.

మినహాయింపుల్లేవు.. తెలియజేయాల్సిందే..
రికవరీ ఏజెంట్లకు సంబంధించి అనుసరించబోయే విధానం, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు రుణగ్రహీతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, రుణాన్ని ఇతరులకు విక్రయించే అవకాశం లాంటి వివరాలను కూడా అందులో పొందుపరచాలని సూచించింది. “మా నియంత్రణలో ఉన్న సంస్థలన్నీ పైన పేర్కొన్న మార్గదర్శకాలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు, ప్రక్రియలు పాటించాలి. 2024 అక్టోబర్ 1 తర్వాత మంజూరు చేసే అన్ని రకాల రిటైల్, ఎంఎస్ ఎంఈ టర్మ్ లోన్ల విషయంలో కస్టమర్లకు పైన పేర్కొన్న వివరాలను ఎలాంటి మినహాయింపుల్లేకుండా అందించాలి” అని ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొంది.

కస్టమర్లకు దోహదం
తాము సూచించిన మార్పుల వల్ల బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు ఏం పొందుతున్నామో కస్టమర్లు తెలుసుకుంటారని ఆర్బీఐ తెలిపింది. రుణాల మంజూరులో పారదర్శకతను పెంచడంతోపాటు కస్టమర్లు రుణాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఈ చర్యలు దోహదపడతాయని వివరించింది. వ్యక్తులు లేదా చిన్న సంస్థలు తీసుకొనే అన్ని రకాల రుణాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

అన్ని రకాల చార్జీలు బహిర్గతం
బ్యాంకులు వెల్లడించేందుకు ఆర్బీఐ తొలిసారి ప్రవేశపెట్టిన ముఖ్యమైన సమాచార విభాగం వార్షిక రుణ శాతం రేటు (ఏపీఆర్). రుణగ్రహీత తీసుకొనే రుణంపై ఏడాదికి అయ్యే వ్యయం ఇది. ఇందులో వడ్డీ రేటుతోపాటు ఇతర చార్జీలు కలిపి ఉంటాయి. థర్డ్ పార్టీ సేవల సంస్థల తరఫున బ్యాంకులు రుణగ్రహీతల నుంచి వసూలు చేసే చార్జీలైన రుణంపై ఇన్సూరెన్స్, లీగల్ చార్జీల వివరాలు కూడా ఏపీఆర్ లో ఉంటాయి. ఏపీఆర్ లో పొందుపరిచే వివరాల వల్ల వివిధ బ్యాంకులు అందించే రుణాలపై పడబోయే అన్ని రకాల చార్జీల వివరాలు రుణగ్రహీతలకు తెలుస్తాయి. అలాగే ఒక రుణంపై ఏయే బ్యాంకులు ఎంత మేర చార్జీలు వసూలు చేస్తాయో పోల్చి వివరించేందుకు లోన్ అగ్రిగేటర్ల (లోన్ల సమాచారం ఇచ్చే వెబ్ సైట్ల)కు అవకాశం లభిస్తుంది. 2015 నుంచి రుణాల మంజూరులో పారదర్శకతకు ఆర్బీఐ పెద్దపీట వేస్తోంది. సూక్ష్మ రుణ సంస్థల కోసం 2022లో ఈ నిబంధనల్లో మరిన్ని మార్పులు తీసుకొచ్చింది.

More Telugu News