Right To Sleep: నిద్రించే హక్కు మనిషి కనీస అవసరం: బాంబే హైకోర్టు

  • ఉల్లంఘించడం సరికాదని వ్యాఖ్య
  • మనీలాండరింగ్ కేసులో 64 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
  • రాత్రంతా ప్రశ్నించడంపై బాధితుడి పిటిషన్
  • ఈడీ అధికారుల తీరును తప్పుబట్టిన కోర్టు
Right To Sleep Is Basic Human Requirement Cannot Violate says Bombay High Court

ఏ మనిషికైనా నిద్ర అనేది కనీస అవసరమని, రాత్రిపూట నిద్రించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని బాంబే హైకోర్టు పేర్కొంది. కేసు విచారణ పేరుతో ఈ హక్కుకు భంగం కలిగించడం సరికాదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులను మందలించింది. ఈమేరకు మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసిన ఓ బాధితుడు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

2023 ఆగస్టులో మనీలాండరింగ్ కేసులో రామ్ ఇస్రానీ అనే 64 ఏళ్ల వృద్ధుడిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. విచారణ పేరుతో రాత్రంతా ప్రశ్నించారు. దీనిపై ఇస్రానీ కోర్టుకెక్కారు. సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా తనను నిద్రపోనీకుండా రాత్రంతా ప్రశ్నించారని పిటిషన్ దాఖలు చేశాడు. అసలు తన అరెస్టే అన్యాయమని, విచారణకు సహకరిస్తానని చెప్పినా, సమన్లకు స్పందించినా కూడా అరెస్టు చేశారని వాపోయాడు.

ఈ పిటిషన్ ను జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ మంజూష దేశ్ పాండేల బెంచ్ విచారించింది. ఈ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, బాధితులను రాత్రంతా ప్రశ్నించడం సరికాదని చెప్పింది. ప్రశ్నించడం, నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చేయడం మొత్తం పగటి పూటే జరపాలని అధికారులకు సూచించింది. నిద్రించే హక్కుకు భంగం కలిగించవద్దని పేర్కొంది. నిద్రలేమి వల్ల శారీరక, మానసిన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని గుర్తుచేసింది. అర్ధరాత్రి వేళల్లో జ్ఞాపకశక్తి పూర్తిస్థాయిలో పనిచేయదని, ఆ సమయాల్లో స్టేట్ మెంట్ రికార్డు చేయొద్దని ఈడీ అధికారులకు సూచించింది.

More Telugu News