Uttam Kumar Reddy: ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం... రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువగా ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నష్టపోతున్నారని విపక్షాలు ఆరోపణలను ఖండించిన మంత్రి
  • వ్యవసాయం విషయంలో లాభనష్టాలను చూసుకోకుండా రైతులను ఆదుకోవడమే లక్ష్యమని వెల్లడి
Uttam Kumar Reddy suggest farmers about paddy selling

ప్రతీ ధాన్యం గింజను తాము కొనుగోలు చేస్తామని... ఇది కాంగ్రెస్ హామీ అని, రైతులు ఎవరూ కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నష్టపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని... కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు రేషన్ సరఫరా కూడా సమర్థవంతంగా సాగుతోందన్నారు. వ్యవసాయం విషయంలో లాభనష్టాలను చూసుకోకుండా రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

గత ఏడాది రాష్ట్రంలో 7,039 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పుడు 7,149 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6,619 కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. కొన్నిచోట్ల ట్రేడర్లు కనీస మద్దతు ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెంటనే రవాణా చేసేలా తాము ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులు బ్యాంకుల ద్వారా సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.

More Telugu News