Telangana: లోక్ సభ ఎన్నికలు... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌ల కీలక సమావేశం

  • ఎన్నికల నేపథ్యంలో మరింత సమన్వయంతో పని చేయాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నిర్ణయం
  • గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న సీఎస్‌లు
లోక్ సభ ఎన్నికల నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌‌లోని సచివాలయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మరింత సమన్వయంతో పని చేయాలని ఇరువురు సీఎస్‌లు నిర్ణయించారు.

సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయ భేటీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్రమ మద్యం, డ్రగ్స్‌ రాకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇదే వాతావరణాన్ని పోలింగ్ వరకు పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం దోహదపడుతుందన్నారు.

తెలంగాణ తరఫున పోలీస్ శాఖ ద్వారా 36 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, ఎక్సైజ్‌శాఖ ఎనిమిది, 224 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పటిష్ఠ గస్తీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎస్ తెలిపారు. తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగకుండా ఇరురాష్ట్రాలు పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్ఠమైన సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు.
Telangana
Andhra Pradesh
Hyderabad
Lok Sabha Polls

More Telugu News