Jagan: ఆ దెబ్బ కణతకు, కంటికి తగల్లేదు... నాకోసం దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడనిపిస్తోంది: సీఎం జగన్

  • కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభ
  • చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం జగన్
  • జగన్ పై రాయి విసిరినంత మాత్రాన ఏమీ చేయలేరని స్పష్టీకరణ
  • ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని వెల్లడి
CM Jagan speech in Gudiwada

ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇవాళ గుడివాడలో మహా సముద్రం కనిపిస్తోందని, మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం పక్షాన నిలిచే జన సముద్రం ఇది అని అభివర్ణించారు. మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

పేదల భవిష్యత్ కొరకు, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలను కొనసాగించేందుకు సమరశంఖం పూరిద్దామా? పెత్తందార్లతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? అంటూ తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించారు. 

"ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కాం. మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద రెండు బటన్లు నొక్కండి. మరో 100 మందికి చెప్పి నొక్కించండి. మీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండడానికి మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక్క జగన్ మాత్రమే. 

గతంలో ఏ మంచినీ చేయని, ఏ పేదను ఆదుకోని... మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అవతలి వైపు ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఒక చంద్రబాబు, ఇక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్... ఇవన్నీ సరిపోవంటూ కుట్రలు, మోసాలు! కుటిల పద్మవ్యూహంలో బాణాలు సంధిస్తోంది ఒక్క జగన్ మీద... మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద. అయినా మీ బిడ్డ అదరడు... బెదరడు. 

ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి... అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు... జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, మన ప్రజల గెలుపును ఎవ్వరూ ఆపలేరు. 

ఇలాంటి దాడులతో నా సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు. ఈస్థాయికి వాళ్లు అంతగా దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, విజయానికి వారు అంత దూరంగా ఉన్నారని అర్థం. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఎంతమాత్రం తగ్గదు. 

నా నుదుటిపై వారు చేసిన గాయం కణతకు తగల్లేదు, కంటికి తగల్లేదు. అంటే... మీ బిడ్డ విషయంలో దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా మరో 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ... గతంలో చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, వివిధ సామాజిక వర్గాలకు చేసిన గాయాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. గాయపర్చడం, మోసాలు చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం అయితే... మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజం. 

ఈ కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసఫీ ఒక్కసారి గమనిస్తే... పేదలకు ఏ మంచి చేయొద్దు అనేదే చంద్రబాబు ఫిలాసఫీ. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నది ఎవరు? ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని ఎవరు చెప్పారు?... ఈ బాబే. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఎన్టీఆర్ ను దించేసి కిలో బియ్యం రూ.5.25కి పెంచింది ఎవరు? అది కూడా ఈ బాబే. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు... ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దన్నది, ప్రభుత్వ బడులను పాడుపెట్టినది ఎవరు? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే... కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు? అది కూడా ఈ బాబే. 

తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలు, బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? అది కూడా ఈ బాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్నది ఎవరు? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినది ఎవరు? అది కూడా ఈ చంద్రబాబే. 

అన్నీ ఓడిపోయి అతలాకుతలమైన చంద్రబాబును పార్టీలో చేరనిచ్చి, కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయననే వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించి, ఆయనపై కూడా రాళ్లు వేయించి, ఆయన చావుకు కారణమైంది ఎవరు? అది కూడా ఈ బాబే. అవసరమైనప్పుడల్లా రామారావు ఫొటో బయటికి తీసి ఆయనకు దండలేస్తాడు. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? అది కూడా ఈ బాబే. 

పేదలకు మంచి చేయకూడదన్నది మాత్రమే తెలిసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తెలిసింది కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇలాంటి వాళ్లను నమ్మడం అంటే చేపల చెరువుకు కొంగలను కాపలా పెట్టడమే... దొంగకు తాళాలు ఇవ్వడమే... పులి నోట్లో తల పెట్టడమే! 

ఇక మీ బిడ్డ జగన్ ను చూడండి. ఈ 58 నెలల పాలనలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను నాలుగు మాటల్లో వివరిస్తాను. ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలను తీసుకువచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్/అర్బన్ హెల్త్ క్లినిక్ లు, నాడు-నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, మహిళా పోలీసులు ప్రతి గ్రామంలో కనిపిస్తారు. ఇక ఏడోది... నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు... ఇది మీ బిడ్డ జగన్ మార్కు. 

ఈ 58 నెలల పాలనలో వైసీపీ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి... జన్మభూమి కమిటీలా, పచ్చపాముల అవినీతి కాట్లు, లంచాల గాట్లు!... ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతుల్లోకి అందించే స్కీములు.... ఇదీ చంద్రబాబుకు మనకు తేడా!"

More Telugu News