Narendra Modi: యూపీలోని కుటుంబ స్థానాన్ని వదిలి కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు: రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు

PM Modi takes dig at Rahul Gandhi

  • పలక్కాడ్ సభలో పరోక్షంగా విమర్శలు గుప్పించిన ప్రధాని నరేంద్రమోదీ
  • కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సంస్థ రాజకీయ విభాగంతో కలిసిందని ఆరోపణ
  • సహకార బ్యాంకు కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని విమర్శ
  • సహకార బ్యాంకు కుంభకోణంపై కేరళ సీఎం అబద్దాలు చెబుతున్నారన్న ప్రధాని

ఉత్తర ప్రదేశ్‌లోని తమ కుటుంబ లోక్ సభ నియోజకవర్గాన్ని వదిలి కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరుచుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన పలక్కాడ్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... 'కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడు ఉత్తర ప్రదేశ్‌లో తన కుటుంబం ప్రాతినిధ్యం వహించిన సీటును వదిలేశాడు. కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరుచుకున్నాడు' అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ 2019 వరకు పలుమార్లు అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ ఆయనను ఓడించి రికార్డ్ సృష్టించారు. 2019లో అమేథితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఈసారీ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 

కేరళలో నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సహాయాన్ని కాంగ్రెస్ తీసుకుంటోందని మోదీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన సంస్థ రాజకీయ విభాగ సంస్థతో కాంగ్రెస్ బ్యాక్ డోర్ ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు.

కేరళలో సామాన్య ప్రజలను కష్టాలకు గురి చేసిన కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై రాహుల్ గాంధీ పెదవి విప్పడం లేదని విమర్శించారు. ఈ సహకార బ్యాంకు కుంభకోణంలో ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో కాంగ్రెస్ నేతలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. కానీ ఓట్లు మాత్రం అడుగుతారా? అని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు.

కేరళ ముఖ్యమంత్రిపై విమర్శలు

గత మూడేళ్లుగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ అబద్దాలే మాట్లాడుతున్నారన్నారు. సహకార బ్యాంకు కుంభకోణంపై ప్రజల ముందు నిజాలు ఉంచడం లేదన్నారు. కానీ ఈడీ మాత్రం ఈ కేసుకు సంబంధించి రూ.90 కోట్లను అటాచ్ చేసిందన్నారు. కేరళ ప్రజల డబ్బులు ఎక్కడకూ పోవని... ఇది మోదీ గ్యారెంటీ అన్నారు. గత కొన్నేళ్లుగా బ్యాంకులను మోసం చేసిన వారి నుంచి రూ.17వేల కోట్లు వెనక్కి తెచ్చామన్నారు. కేరళలో తాగునీటి సమస్య ఉందని... రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. అదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వం మాత్రం నారాయణగురు ఐడియాలజీ ప్రకారం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలు... పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News