Chandrababu: రాజాం సభలో తన అర్ధాంగి భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు

  • విజయనగరం జిల్లా రాజాంలో ప్రజాగళం సభ
  • గతంలో తన భార్య ఎన్నడూ ఇల్లు దాటి బయటికి రాలేదన్న బాబు 
  • తాను జైల్లో ఉన్నప్పుడు 203 మంది ప్రాణత్యాగం చేశారని వివరణ
  • వారి కుటుంబాలను కలవడం భువనేశ్వరి ఒక బాధ్యతగా బావించిందని స్పష్టీకరణ 
Chandrababu mentions his wife Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in his Rajam Praja Galam event

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఈ సాయంత్రం ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తన అర్ధాంగి నారా భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను జైల్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రతో ప్రజల్లోకి వచ్చిన వైనాన్ని చంద్రబాబు కొనియాడారు. నాడు కష్టకాలంలో తన కోసం ప్రాణత్యాగం చేసినవారికి, తమ కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. 

గతంలో నా భార్య ఇల్లు దాటి బయటికి రాలేదు

నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. ఒక్కోసారి బాధ కలుగుతుంది... ఇక్కడే ప్రతిభా భారతి ఉన్నారు... ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడకు తెలుసు... నా భార్య ఎన్నడూ ఇల్లు దాటి బయటికి రాలేదు. ఎన్టీరామారావు బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉన్నా, మళ్లీ మొన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజూ ఆమె బయటికి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో ఇష్టానుసారం తిట్టారు. ఒక ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా? 

నేను ఎలాంటి పనులు చేశానో ఆమెకు తెలుసు. నన్ను అరెస్ట్ చేయగానో ఎంతో బాధపడింది. అందుకే ఈ రాష్ట్రంపై ఒక బాధ్యతతో సుమారు 6 నెలల పాటు నిజం గెలవాలి యాత్ర చేపట్టింది. ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 203 మంది మనస్తాపంతో ప్రాణాలు విడిచారు. దాదాపు 80 దేశాల్లో నాకోసం ర్యాలీలు చేపట్టారు. 

ఆ సమయంలో ఈవిడ (నారా భువనేశ్వరి) కూడా 203 కుటుంబాలకు ఆర్థికసాయం చేసింది. మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు... మేం మీకు అండగా ఉంటామని వారికి భరోసానిచ్చింది. వారి పిల్లలు చదువుకుంటామంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని ధైర్యాన్నిచ్చింది. మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా సొంత కుటుంబమేనని రాష్ట్రమంతా తిరిగి చెప్పగలిగింది. 

ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి... దగ్గరదగ్గర 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9,079 కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాలి యాత్రను నిర్వహించింది. అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తి నా భార్య.

పవన్ కల్యాణ్... ఒక సూపర్ స్టార్

ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్. ప్రజల కోసం, రాష్ట్రం కోసం సినిమాలను వదిలిపెట్టుకుని వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అవమానాలకు గురిచేశారో మీకు తెలుసు. కానీ మడమ తిప్పని నాయకుడిగా, ప్రజల కోసం పోరాడుతున్న సూపర్ స్టార్ పవన్ కల్యాణ్. కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీనే అధికారంలోకి వస్తారు. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మోదీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి భారత్ ను ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలపడం ఖాయం. ఇప్పుడు నేను, పవన్ కల్యాణ్, మోదీ కలిసి వస్తున్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం... ఇది అసాధ్యమేమీ కాదు, సాధ్యం చేసి చూపిస్తాం.

జగన్ తన ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు

ఏ నాయకుడైనా సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచాలి. ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం వినియోగించాలి. మన హయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం. ఇవాళ జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు. దేశంలోనే సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్ అయితే, దేశంలోనే నిరుపేదలు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గతంలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం... నేడు జగన్ గంజాయి, డ్రగ్స్ ఇస్తున్నాడు. నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి... ఇప్పుడూ ఊరూరా బుల్డోజర్ తో కూల్చివేతలు వచ్చాయి. 

మనది సంక్షేమ రాజ్యం... జగన్ ది విధ్వంస రాజ్యం. ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించాడు. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర... నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. ఇదీ... ఆయనకూ, మనకూ తేడా.

నాడు మేం చేపట్టిన పనులు కొనసాగి ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేది. కానీ జగన్ వచ్చాక అభివృద్ధి ఊసే లేదు. మేం విశాఖను వాణిజ్య రాజధాని చేశాం... కానీ వైసీపీ నేతలు విశాఖలో భూకబ్జాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మార్చింది! 

నాడు విశాఖకు అదానీ డేటా సెంటర్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అగ్రగామి సంస్థలను తీసుకువచ్చాను. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్నింటినీ తరిమేసింది. ఎంతో కష్టపడి విశాఖకు మెడ్ టెక్ పార్కు తెచ్చాం. జగన్ కు విశాఖపై ప్రేమ లేదు... ఆస్తులపైనే ప్రేమ! విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిల పెత్తనం ఏంటి? 

ఎవరి వైపు ఉంటారో వాలంటీర్లు ఆలోచించుకోవాలి.

వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. నాతో ఉంటేనే మీకు మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. మీరు వైసీపీ వాళ్లకు సహకరిస్తే ఎప్పటికీ ఊడిగం చేయాల్సి ఉంటుంది. వాలంటీర్లలో బాగా చదువుకున్న వాళ్లు ఉన్నారు... మీకు రూ.10 వేలు ఇవ్వడమే కాదు, ఒక్కొక్కరికి లక్షల రూపాయలు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా.  

'జే'గన్ రెడ్డి అంటే ఇదే!

నిన్నటి వరకు ఇక్కడొక ఎమ్మెల్యే ఉండేవాడు. ఇప్పుడాయన ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయాడు. ఎమ్మెల్యేలను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు... వాళ్లు సొంత నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మీరెవరూ ఓటేయరు... మరో నియోజకవర్గానికి వెళితే అక్కడి ప్రజలను మోసం చేయవచ్చు... 'జే'గన్ రెడ్డి అంటే ఇదే. 

ఆయనపై పడింది పెద్ద రాయా?

జగన్ రెడ్డి మోసగాడు... చెప్పేవన్నీ అబద్ధాలు... చేసేవన్నీ మోసాలే! నిన్న గులకరాయి డ్రామా ఆడాడు. అదేమన్నా పెద్ద రాయా? నా మీద విశాఖలో ఇంత పెద్ద రాయి వేశారు. ఈయన మీద ఎవరో రాయి వేశారంట... అది వచ్చి తగిలిందంట... అదెక్కడా కనిపించడంలేదు. అదిగో గుడ్డు, అదిగో పొదిగింది, అదిగో లేచిపోయింది అంటూ కనికట్టు కట్టే వ్యక్తి ఈ జగన్. 

నాతో డ్రామాలు ఆడుతున్నాడు. నేను కరెంట్ ఆపేశానంట... ప్రభుత్వంలో ఉంది నేనా? చెత్తమాటలు మాట్లాడుతున్నాడు. నాడు బాబాయ్ ని గొడ్డలిపోటుతో చంపి, గుండెపోటు అని డ్రామాలు ఆడి, నారాసుర రక్తచరిత్ర అని ఆరోపించారు. ఇతను చేసే నేరాలను వేరే వారిపై తోసేసే దిట్ట. ఎవరైతే బాధితులు ఉన్నారో వారినే నిందితులుగా జైల్లో పెట్టేస్తున్నారు.

More Telugu News