YS Viveka Murder Case: వివేకా హత్య కేసు ఏ1 నిందితుడితో అవినాశ్‌కు పరిచయం ఉంది: సునీత

  • హైదరాబాద్‌లో వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి మీడియా సమావేశం
  • వివేకా హత్య కేసు వివరాలతో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ 
  • కేసుకు సంబంధించి కాల్ డేటా, చిత్రాల ప్రదర్శన
  • ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరని, ఇప్పుడు ప్రజల మద్దతు ఉందని వ్యాఖ్య
Sunitha Narreddy powerpoint presentation of Viveka case facts in Hyderabad

వివేకా హత్య కేసులో తాను న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చేయాల్సింది చాలా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివేకా హత్య కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తరువాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్, ఐపీడీఆర్ డేటాను సునీత వెల్లడించారు.

వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌తో ఎంపీ అవినాశ్‌కు పరిచయం ఉందని సునీత తెలిపారు. అవినాశ్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో మరో నిందితుడు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ ఉన్న ఫొటోలను ఆమె ప్రదర్శించారు. ఉమాశంకర్‌రెడ్డికి అవినాశ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు బయటపెట్టారు. ఎంవీ కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడని, శివశంకర్ రెడ్డి ఆయనకు మధ్య ఫోన్‌కాల్స్ ఉన్నాయని, కానీ అవినాశ్ మాత్రం వీళ్లెవరో తెలీదని చెబుతున్నారని అన్నారు. 

హత్యకు కొన్ని రోజుల ముందు ఓ సభలో వేదికపై అవినాశ్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకా వెళ్లిపోతున్న దృశ్యాలను సునీత ప్రదర్శించారు. వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరుగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైసీపీ నేత వ్యాఖ్యలను ఆమె పీపీటీలో పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. ప్రజలకు నిజం తెలిసేందుకు వీటిని ప్రదర్శించినట్టు వివరించారు.

More Telugu News