Chandrababu: ఎక్కువ సార్లు రాళ్ల దాడులు జరిగింది చంద్రబాబు పైనే!

  • నిన్న చంద్రబాబు, పవన్ లపై రాళ్ల దాడులు
  • చంద్రబాబు వరకు చేరని రాయి
  • గతంలో నాలుగు సార్లు చంద్రబాబుపై రాళ్ల దాడి
Most of the stone attacks are on Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన రాళ్ల దాడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పెద్ద రాజకీయ చర్చకు ఈ ఘటన తెరలేపింది. జగన్ పై టీడీపీ హత్యాయత్నం చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... మరో కోడికత్తి డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై రాళ్ల దాడులు జరిగాయి. విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబుపై, తెనాలిలో పవన్ కల్యాణ్ లపై దుండగులు రాళ్లు విసిరారు. 

గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి రాళ్లు విసిరినప్పటికీ... అవి ఆయన వరకు చేరలేదు. ఈ దాడిని గుర్తించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు యత్నించగా వాళ్లు పారిపోయారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అందరూ చూడండి.. తనపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అరేయ్... మిమ్మల్ని ప్రజలు వదిలి పెట్టరు... తరిమితరిమి కొడతారు అని హెచ్చరించారు. వైసీపీ బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఇక్కడకు వచ్చిందని అన్నారు. 

మరోవైపు, ఇప్పటి వరకు చంద్రబాబుపైనే ఎక్కువ రాళ్లదాడులు జరిగాయి. గత ఏడాది ఆగస్ట్ లో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో రాళ్లదాడి జరిగింది. ఆ దాడి సందర్భంగా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను చంపేందుకు కుట్ర జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ గొడవకు చంద్రబాబే కారణమని పోలీసులు కేసు పెట్టారు. 

2021 తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బాబుపై దాడి జరిగింది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాళ్లు విసిరారు. గత ఏడాది ఏప్రిల్ లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు వెళ్తున్న చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేశ్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. 2022లో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. ఆ సందర్భంగా ఒక దుండగుడు చంద్రబాబుపై రాయి విసిరాడు. అయితే అది చంద్రబాబుకు మిస్ అయి... ఆయన భద్రతాధికారికి తగిలింది. ఈ దాడిలో భద్రతాధికారి తీవ్రంగా గాయపడ్డారు.

More Telugu News