day: రోజుకు 26 గంటలు.. కొత్తగా చిత్రమైన ప్రతిపాదన!

To increase the day to 26 hours A pictorial proposal in Norway
  • యూరోపియన్‌ కమిషన్‌ కు నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్‌ లేఖ
  • సరదా, సంతోషాలకు సమయం మిగలడం లేదని విజ్ఞప్తి
  • గడియారంలో గంటలు పెంచితే.. నిజంగా సమయం పెరుగుతుందా అంటూ సెటైర్లు
రోజూ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా హడావుడే. రోజుకు 24 గంటలున్నా ఏమాత్రం సరిపోవడం లేదని.. అసలు నిద్రపోవడానికి కూడా సరిగా టైం లేదని చెప్పేవారు ఎందరో. ఏమైనా అంటే.. ఉన్న సమయాన్నే పద్ధతిగా, ప్రణాళిక ప్రకారం వినియోగించుకుంటే చాలా సమయం మిగులుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు. కానీ నార్వేలోని వాడ్సో అనే పట్టణ మేయర్ వెంచే పెడర్సన్‌ మాత్రం చాలా భిన్నంగా ఆలోచించారు.

టైమ్‌ మార్చాలంటూ యూరోపియన్‌ కమిషన్‌ కు లేఖ
ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలకు సరదా, సంతోషాలేమీ ఉండటం లేదని.. అందువల్ల 24 గంటల టైమ్‌ను మరో రెండు గంటలు పెంచేసి.. 26 గంటలు చేస్తే బాగుంటుందని పెడర్సన్‌ ప్రతిపాదించారు. దీనిపై ‘మోర్‌ టైమ్‌’ ప్రాజెక్టు పేరుతో.. నేరుగా యూరోపియన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. ఇలా చేస్తే ప్రజలకు హడావుడి జీవితం తప్పుతుందని.. మిగిలిన సమయాన్ని సరదాగా గడుపుతారని పేర్కొన్నారు. అంతేకాదు.. టైమ్‌ను పెంచినప్పుడు గడియారాల్లో 12 తర్వాత 13 కూడా పెట్టేస్తే సరిపోతుందని కూడా పెడర్సన్‌ సూచించారు.

అసలు ప్రతిపాదన ఏంటి?
ఏడాది పొడవునా అత్యంత చల్లగా ఉండే ఆర్కిటిక్‌ ప్రాంతంలో వాడ్సో పట్టణం ఉంటుంది. ఎప్పుడూ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారే తప్ప.. కొత్తగా ఎవరూ రాకపోవడంతో మేయర్‌ ఈ చిత్రమైన ప్రతిపాదన చేశారట. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మేయర్‌ ప్రతిపాదనపై సెటైర్లు పడుతున్నాయి. గడియారంలో గంటలు పెంచినంత మాత్రాన.. రోజులో ఉండే సమయమేమీ పెరగదు కదా.. ఈ పిచ్చి ప్రతిపాదన ఎందుకు? అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి.
day
24 hours
26 hours
norway
europe
offbeat

More Telugu News