YS Jagan: జగన్‌పై రాయి దాడి ఘటనపై ఎంపీ రఘురామకృష్ణరాజు వెలిబుచ్చిన సందేహాలు ఇవే

  • మరో సానుభూతి కోసం జగన్ తెరతీసిన నాటకమని వ్యాఖ్యానించిన నరసాపురం ఎంపీ
  • అంతా సినీ ఫక్కీలో జరిగిందని వ్యాఖ్య
  • ఈ దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయన్న రఘురామ
  • ఈ 22న నామినేషన్ వేయబోతున్నానని వెల్లడి
another sympathy drama says MP Raghuramakrishna Raju on stone pelt on CM Jaganmohan Reddy

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో శనివారం జరిగిన రాయి దాడి ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మరో సానుభూతి కోసం తెర తీసిన నాటకం ఇదని వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైసీపీ సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా సాగుతూనే ఉందని ప్రస్తావించారు. అయినా జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. 

సానుభూతి కోసం జరిగిన ముందస్తు నాటకంపై వైసీపీ నాయకులు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రఘురామ అన్నారు. వివేకా హత్య వ్యవహారంలో కడపలో మొదలైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా వ్యాపించడంతో స్వయంగా జగనే సానుభూతి కోసం ఇలాంటివి చేయించుకున్నారనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఆదివారం భీమవరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. జగన్‌పై రాయి దాడి ఘటన వెనుక ఎన్నో సందేహాలున్నాయన్నారు

అంతా సినీఫక్కిలా ఉంది..
దాడి సమయంలో భద్రతా వలయం ఏమైనట్లు?. ‘యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్తు ఎందుకు పోయింది?. ఆ క్షణంలో సాక్షి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిచిపోయింది? ఘటన జరిగిన వెంటనే ‘క్యాట్ బాల్’ అని ఎలా చెప్పారు’ అని రఘురామ ప్రశ్నించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా జరగడం, జనాలు లేని ప్రాంతం చూసి గజమాలను ఏర్పాటు చేయడం, దానివెనుకే రాయి తగలడం అంతా సినీ ఫక్కీలో ఉందని రఘురామ కృష్ణరాజు సందేహాలు వ్యక్తం చేశారు. రాళ్లు విసిరితే కేవలం సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లికి మాత్రమే గాయాలవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదని అన్నారు. మరోవైపు ఈ 22న తాను నామినేషన్‌ వేయబోతున్నానని రఘురామ తెలిపారు. అయితే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా అనే దానిపై స్పష్టత రాలేదని చెప్పారు.

More Telugu News