Air India: టెల్ అవీవ్‌కు ఎయిరిండియా విమానాల రద్దు.. కీలక ప్రకటన

Air India cancels flights to Tel Aviv amid Israel Iran conflict
  • తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఎయిరిండియా
  • ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
  • ఇటీవలే సర్వీసుల పునరుద్ధరణ.. కొన్నిరోజుల్లోనే నిలిపివేత
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లోని కీలక నగరమైన టెల్ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య నేరుగా నడుస్తున్న సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ఆదివారం పొద్దుపోయాక ప్రకటించింది. 

ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య వారానికి 4 సర్వీసులను నడుపుతోంది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 3నే ఈ సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు టెల్అవీవ్‌లో నరమేధం సృష్టించడం, అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించిన విషయం తెలిసిందే. 

కాగా శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. 200లకుపైగా డ్రోన్లు, డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఇటీవల సిరియాలోని డమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషరీ గార్డ్స్‌కు చెందిన కీలక అధికారితో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ తాజా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Air India
Tel Aviv
Iran
Israel

More Telugu News