Chandrababu: సీఎం రమేశ్ కు ఢిల్లీ బాగా తెలుసు... అవతలి వ్యక్తికి ఢిల్లీ వీధులు చూడాలంటే ఐదేళ్లు పడుతుంది: చంద్రబాబు

  • విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాతిపదికనే టీడీపీ ఆవిర్భవించిందని వెల్లడి
  • అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ ను, పాయకరావుపేట నుంచి అనితను గెలిపించాలని పిలుపు
Chandrababu speech in Payakaraopeta

విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇవాళ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాతిపదికగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇవాళ మోదీ సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. మేం ఇప్పటికే ఏపీలో సూపర్-6 పేరుతో మేనిఫెస్టో తీసుకువచ్చాం... మిత్రుడు పవన్ కల్యాణ్ 6 కాదు సార్ 10 ఇద్దాం అని అన్నాడు... నేను ఓకే అన్నాను... ఇప్పుడు మేమిచ్చే పథకాలు, కేంద్రం ఇచ్చే పథకాలు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు. 

మనం మహాలక్ష్మి పథకం అన్నాం... వారు నారీ శక్తి అన్నారు... ఈ రెండు కలుపుతాం అన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఇద్దరుంటే రూ.3000, ముగ్గురుంటే రూ.4500 ఇస్తామని తెలిపారు. 

జగన్ ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇస్తున్నాడని మండిపడ్డారు. కానీ తాము తల్లికి వందనం కింద, ఎంత మంది ఉన్నా రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు కూడా ఇచ్చే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. 

నాడు దీపం పథకం తానే తీసుకువచ్చానని, ఇప్పుడు రేట్లు పెరగడంతో వాడకం మానేశారని, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం కాబట్టి ఆటోడ్రైవర్లకు కూడా సమాన ప్యాకేజి కల్పిస్తాం... త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని చంద్రబాబు వివరించారు. 

కేంద్రం యువశక్తి పథకం తీసుకువస్తోంది, మనది యువగళం... ఈ రెండు కలుపుతాం... 20 లక్షల ఉద్యోగాలు మీకిచ్చే బాధ్యత మాది... నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇప్పిస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేల పెన్షన్ ను మీ ఇంటి వద్దకే అందిస్తా... మేం అధికారంలోకి వచ్చేది జూన్ లో... కానీ ఏప్రిల్, మే నెల పెన్షన్లను కూడా కలిపి జూన్ లో అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గరీబ్ యోజన కింద కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యం పథకాన్ని కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. 

జగన్ ఏమీ ఇవ్వకుండా, కేంద్రం ఇచ్చేవాటికి తన స్టిక్కర్లు వేసుకుంటున్నాడని విమర్శించారు. వాలంటీర్లకు కూడా ఇప్పటికే చెప్పాం... గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం అని హామీ ఇచ్చారు.

పారాచ్యూట్ వేసుకుని వచ్చాడు!

మొన్నటివరకు ఇక్కడొక ఎమ్మెల్యే ఉండేవాడు. ఏమీ మిగల్చకుండా మొత్తం పాయకరావు పేటను ఊడ్చేశాడు. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఇక్కడికి అభ్యర్థిగా ఎక్కడ్నించో వచ్చాడు... పారాచ్యూట్ వేసుకుని దిగాడు. అతడు ఆల్రెడీ అక్కడ చెత్త... అతడ్ని తీసుకువచ్చి పాయకరావుపేటలో పడేశారు. గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు నక్కపల్లిలో ఏపీఐఐసీ ద్వారా 8 వేల ఎకరాల భూ సేకరణ జరిపాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా... పరిశ్రమలు తీసుకువస్తా... పెట్రో కెమికల్ కారిడార్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడి పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలు తీసుకువస్తాం.

సీఎం రమేశ్ సమర్ధుడు

సీఎం రమేశ్ ఒక సమర్థుడైన వ్యక్తి. నేనెరిగిన వ్యక్తి. ఢిల్లీలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి సీఎం రమేశ్. అవతలి వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే ఐదేళ్లు పడుతుంది. కానీ సీఎం రమేశ్ కు పన్నెండేళ్ల అనుభవం ఉంది. కేంద్ర నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 

రాష్ట్రం, కేంద్రం డబుల్ ఇంజిన్ లా కలిస్తే, దానికి పవన్ కల్యాణ్ శక్తి కూడా తోడైతే ఆ పవరే వేరు. మరోసారి చెబుతున్నా... అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సీఎం రమేశ్ సరైన అభ్యర్థి. ఇక, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తగిన అభ్యర్థి అనిత.  వీరిద్దరినీ మీరందరూ ఆశీర్వదించాలి. 

  • Loading...

More Telugu News