Chirag Antil: కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత

  • ఇటీవల కాలంలో విదేశాల్లో హత్యకు గురవుతున్న భారతీయ విద్యార్థులు
  • కెనడాలోని వాంకోవర్ లో హత్యకు గురైన చిరాగ్ ఆంటిల్
  • కారులో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి
Indian student shot dead in Canada

ఇటీవల కాలంలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు హత్యకు గురవుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా కెనడాలో చిరాగ్ ఆంటిల్ అనే భారతీయ విద్యార్థి తుపాకీ గుళ్లకు బలయ్యాడు. తన కారులోనే శవమై కనిపించాడు. కెనడాలోని దక్షిణ వాంకోవర్ లో ఏప్రిల్ 12న ఈ దారుణం జరిగింది. 

చిరాగ్ ఆంటిల్ వయసు 24 ఏళ్లు. రాత్రి 11 గంటల సమయంలో తమకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఆడి కారులో రక్తపు గాయాలతో మృతదేహం కనిపించింది. అతడిని భారతీయ విద్యార్థి చిరాగ్ ఆంటిల్ గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. 

చిరాగ్ ఆంటిల్ కెనడాలో హత్యకు గురయ్యాడన్న సమాచారంతో హర్యానాలోని అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటన జరిగిన రోజు కూడా తాము చిరాగ్ తో మాట్లాడామని అతడి సోదరుడు రోనిత్ వెల్లడించారు. ఫోన్ లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడని, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని తెలిపారు. చిరాగ్ కు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు. 

కాగా, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వరుణ్ చౌదరి దీనిపై స్పందిస్తూ, చిరాగ్ ఆంటిల్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు, చిరాగ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు గో ఫండ్ మీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా నిధుల సేకరణ జరుగుతోందని కెనడా మీడియా వెల్లడించింది.

More Telugu News