Boduppal Wine shop: హైదరాబాద్ లో స్కూలు ముందే వైన్ షాప్.. ఎత్తేయాలంటూ స్థానికుల ఆందోళన

Boduppal Residents Protest Aganist Wine Shop Owner In Hyderabad
  • ఏమీ చేయలేమంటూ చేతులెత్తేసిన పోలీసులు
  • వైన్స్ పక్కనే టెంట్ వేసి మరీ ఆందోళన చేస్తున్న స్థానికులు
  • బోడుప్పల్‎లోని సిద్ధార్థ స్కూల్ ఎదురుగ వైన్స్ షాపు ఏర్పాటు 
హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఏర్పాటు చేసిన ఓ వైన్ షాపును వెంటనే ఎత్తేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎదురుగానే స్కూలు.. పక్కనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ ఉంది.. అయినా సరే ఇక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. అన్ని అనుమతులు ఉండడంతో తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో వైన్స్ షాపును ఇక్కడి నుంచి ఎత్తేసేవరకూ పోరాడాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. వైన్ షాపు పక్కనే ఓ టెంట్ ఏర్పాటు చేసుకుని, ఫ్లెక్సీలతో ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పనిచేసే మహిళలు సాయంత్రం వేళల్లో నిరసనకు కూర్చుంటున్నారు.

ఇటీవల నిర్వహించిన టెండర్లలో సింధూర లిక్కర్స్ పేరుతో షాప్ కు పర్మిషన్ పొందామని, జనవరి నుంచి షాప్ ఏర్పాటు చేయడానికి బోడుప్పల్ లో సరైన స్థలం దొరకడంలేదని యజమాని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో వైన్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినా కాలనీవాసులు అడ్డుకోవడంతో నెల రోజులుగా ప్రారంభించలేదని వివరించారు. నెల క్రితం సిద్ధార్థ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని, రేకుల షెడ్డు ఏర్పాటు చేసి వైన్ షాపును ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే షాపు ప్రారంభించామని, స్కూలుకు తగిన దూరంలోనే షాపు ఉందని వివరించారు. అప్పటి నుంచి స్థానికులు తమ షాప్ పక్కనే టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్నారని వాపోయారు.
Boduppal Wine shop
Wines near School
Hyderabad
Locals Protest

More Telugu News