KTR Tweet: అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా.. పదేళ్లు శ్రమించినం: కేటీఆర్

Former Minister KTR Tweet On Ambedkar Birth Anniversary

  • రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామని వెల్లడి
  • విశ్వమానవుడి ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించామని వివరణ
  • 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు కేటీఆర్ నివాళి

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని సగర్వంగా భారతదేశానికి అందించిన విశ్వమానవుడు, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు బీఆర్ఎస్ తరఫున ఘనంగా నివాళి అర్పిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా పదేళ్ల పాటు తెలంగాణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు వివరించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. 

‘సామాజిక న్యాయమే నినాదంగా.. భిన్నత్వంలో ఏకత్వమే విధానంగా.. లౌకిక వాదాన్ని కాపాడటమే లక్ష్యంగా.. అణగారిన వర్గాల అభ్యున్నతే ఆదర్శంగా.. సమసమాజ నిర్మాణమే నిజమైన సందేశంగా.. సమాఖ్య స్పూర్తిని కాపాడటమే తక్షణ కర్తవ్యంగా..’ ముందుకు సాగాలని చెప్పారు.

బాబాసాహెబ్ చూపిన బాటలోనే తెలంగాణ తెచ్చుకున్నామని, సచివాలయానికి సగర్వంగా ఆయన పేరు పెట్టుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని చెప్పారు. సమున్నత విజ్ఞాన మూర్తిని గుండెల నిండా గౌరవించుకున్నామని వివరించారు. అంబేద్కర్ గారి ఆలోచనలు విశ్వజనీనమని, వాటిని అక్షరాలా ఆచరించడమే మనందరి లక్ష్యమని కేటీఆర్ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ గారి సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు అందించడమే మన స్వప్నమని చెప్పారు. 

ఓవైపు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేసి, వాటిని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారని, మరోవైపు ప్రజాస్వామ్యాన్నే కాలరాసి, రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకునే కుతంత్రాలు జరుపుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత భారత సమాజంపై ఉందని చెప్పారు. అంబేద్కర్ కు నిండుమనసుతో మనమిచ్చే నిజమైన నివాళి అదేనని కేటీఆర్ తెలిపారు. జై భీమ్.. జై తెలంగాణ.. అంటూ తన ట్వీట్ ను ముగించారు.

  • Loading...

More Telugu News