Petrol Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోదీ హామీ

  • దేశంలో 6జి టెక్నాలజీ అమలుకు ఏర్పాట్లు
  • ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి
  • ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను మారుస్తామన్న మోదీ
  PM Modi Says Sankalp Patra Strengthens 4 Pillars Of Viksit Bharat

దేశవ్యాప్తంగా త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆదివారం బీజేపీ మేనిఫెస్టోను ఢిల్లీలో మోదీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళతామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 5జీ అమలు చేస్తున్నామని, త్వరలో 6జి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు. ఏజెన్సీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలుకలిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. శాటిలైట్ పట్టణాల నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టామని గుర్తుచేశారు. వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో, బుల్లెట్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టిస్తున్నామని మోదీ వివరించారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.

More Telugu News