Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి వేళ అమెరికా కీలక ప్రకటన

  • ఇజ్రాయెల్‌కు మద్దతిస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
  • అమెరికా జాతీయ భద్రతా బృందంతో మాట్లాడిన అధ్యక్షుడు
  • ఇరాన్, దాని అనుకూల గ్రూపుల దాడులను ప్రతిఘటిస్తామని ఇజ్రాయెల్‌కు బైడెన్ హామీ

America announces support to Irans amid Iran drone and missile attack

డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేస్తున్న వేళ ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు సంబంధించిన వివరాల కోసం జాతీయ భద్రతా బృందంతో మాట్లాడానని ‘ఎక్స్’ వేదికగా జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్, అనుకూల గ్రూపులు చేసే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఇజ్రాయెల్ భద్రతకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని జో బైడెన్ హామీ ఇచ్చారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లను అమెరికా బలగాలు కూల్చివేస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్‌కు అదనపు రక్షణ అందించడానికి కీలకమైన ప్రాంతాల్లో అమెరికా దళాలు మోహరించి ఉన్నాయని పేర్కొన్నారు.

సిరియాలోని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ ఆర్మీకి చెందిన కీలక అధికారి సహా 13 మంది చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ పనేనని ప్రకటించిన ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. శనివారం రాత్రి భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఇది "ఆత్మ రక్షణ" చర్యగా ఇరాన్ అభివర్ణించింది. కాగా ఇరాన్ ప్రయోగించిన చాలా క్షిపణులను అడ్డుకున్నామని, గాల్లోనే కూల్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

మరోవైపు భారత్ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శతృత్వంతో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుదేశాలు సంయమనం పాటించి వెనక్కి తగ్గాలని ఇరాన్, ఇజ్రాయెల్‌లను భారత్ కోరింది. తక్షణమే వెనక్కి తగ్గాలని, దౌత్యపరమైన చర్చలు ఆరంభించాలని కోరుతున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రాంతంలోని తమ రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయ సమాజంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో భద్రత, శాంతి- స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా భారత్ వ్యాఖ్యానించింది.

More Telugu News