BJP: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక హామీలు ఇవే

These are the promises made in BJP Lok Sabha election 2024 manifesto
  • భవిష్యత్‌లో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని ప్రధాని మోదీ వాగ్దానం
  • వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని భరోసా
  • 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ
లోక్‌సభ ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి ‘గ్యాన్’  లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో పలు కీలక హామీలు ఉన్నాయి. 

భవిష్యత్‌లో పైప్ లైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని, ఇక రాబోయే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్‌ అందిస్తామని వాగ్దానం చేశారు. గడిచిన 10 ఏళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల గృహాలను నిర్మిస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తామని, ధరల స్థిరీకరణపై ఫోకస్ పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పార్టీ పేర్కొంది.

కాగా, వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
BJP
BJP Manisfesto
Narendra Modi
Lok Sabha Polls

More Telugu News