YS Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేశ్, షర్మిల, కేటీఆర్

Prime Minister Narendra Modi and Nara Lokesh and KTR reacted on the incident of stone attack on AP CM Jagan

  • సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న ప్రధాని మోదీ
  • దాడిని ఖండించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు
  • సీఎంపై దాడి విచారకరమన్న వైఎస్ షర్మిల
  • ‘జాగ్రత్త జగన్ అన్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్

శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఓ ఆగంతుకుడు చేసిన రాయి దాడి ఘటనపై రాజకీయ ప్రముఖలు స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సీఎంపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఎలక్షన్ కమిషన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్: లోకేశ్
సీఎం జగన్‌పై దాడి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్?. ఇంకెక్కడి నుంచి వస్తా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!’’ అంటూ సెటైర్ వేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ ఆయన పంచ్‌లు విసిరారు. 

దాడిని ఖండించిన వైఎస్ షర్మిల
సీఎం జగన్‌పై దాడిని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల ఖండించారు. ఈ దాడి విచారకర, దురదృష్టకర ఘటన అని అన్నారు. ‘‘ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా మేము భావిస్తున్నాం. కావాలని చేసినదైతే ప్రతిఒక్కరూ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. సీఎం త్వరగా కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని షర్మిల అన్నారు.

సురక్షితంగా ఉన్నందుకు సంతోషం: కేటీఆర్
‘‘
మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా’’ అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, దాడికి పాల్పడినవారిపై భారత ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News