Balakrishna: ఈసారి కూడా జగన్ వస్తే ఇంకేమీ మిగలదు: బాలకృష్ణ

  • కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బాలకృష్ణ
  • జగన్ పొగరు అణచివేసే సమయం వచ్చిందని వెల్లడి
  • జగన్ కారణంగా పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శలు
  • టీడీపీకి కార్యకర్తలే బలం అని ఉద్ఘాటన 
Balakrishna speech in Kadiri and Puttaparti

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాధికార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

విర్రవీగకు జగన్... నీ పొగరు అణచివేసే సమయం వచ్చిందని హెచ్చరించారు. నీ అహంకారపు నరాలు తెగిపడే రోజు వచ్చిందని అన్నారు. టీడీపీ రాయలసీమలో సాగునీరు పారించి బీడుభూములను సస్యశ్యామలం చేస్తే, వైసీపీ ముఠాకక్షలను పెంపొందించి రక్తపుటేరులు పారించిందని విమర్శించారు. 

నవరత్నాలు అంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంకేమీ మిగలదని బాలకృష్ణ స్పష్టం చేశారు. సొంత బాబాయ్ ని చంపిన నిందితులను జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. 

టీడీపీకి కార్యకర్తలే బలం: పుట్టపర్తిలో బాలయ్య

ఇక పుట్టపర్తి సభలోనూ బాలకృష్ణ ప్రసంగించారు. టీడీపీకి ఉన్నంత కార్యకర్తల బలం మరే పార్టీకి లేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ముందుకు తీసుకెళుతున్నారని వెల్లడించారు. పసుపు అనేది శుభానికి, ఆనందానికి, ఆరోగ్యానికి, అభివృద్ధికి, సంక్షేమానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం అని అభివర్ణించారు. 

రాష్ట్ర విభజన జరిగాక, తెలంగాణ తలసరి ఆదాయానికి దీటుగా నవ్యాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని పెంచిన ఘనత చంద్రబాబు సొంతం అని కొనియాడారు. సిద్ధం సిద్ధం అని ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు... దేనికి సిద్ధం? అని ప్రశ్నించారు.

More Telugu News