Chidambaram: 2019తో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుస్తాం: లోక్ సభ ఎన్నికలపై చిదంబరం జోస్యం

  • దక్షిణాదిన మంచి సీట్లు గెలుచుకుంటామని చిదంబరం ధీమా
  • పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కీలకమైన నాయకురాలని వ్యాఖ్య
  • హర్యానా, యూపీ, బీహార్, ఢిల్లీలో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం
  • హిందూమతానికి, హిందువులకు ఎలాంటి ప్రమాదం లేదన్న చిదంబరం
P Chidambaram predicts INDIA bloc will put up a good show in 4 Southern states

గత లోక్ సభ ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లను గెలుచుకుంటుందని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అంచనా వేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని... 2019 కంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాదిన మంచి సీట్లు గెలుచుకుంటామన్నారు. శనివారం ఆయన ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

దేశంలో హిందూమతానికి, హిందువులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కానీ బీజేపీ మాత్రం మోదీని హిందూ రక్షకుడిగా, ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. ఆమె నేతృత్వంలో బెంగాల్లో ఇండియా కూటమి బలోపేతమవుతుందన్నారు. తాను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఇండియా కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు. కేరళలో 20 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క సీటూ రాదన్నారు. హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఢిల్లీలలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, అవి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నాయని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చాతీవు ఇప్పటిది కాదని, 50 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం అన్నారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారని... కానీ ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారని ప్రశ్నించారు.

More Telugu News