Chandrababu: నా అనుభవం అంత లేదు నీ వయసు... నువ్వా నా వయసు గురించి మాట్లాడేది?: చంద్రబాబు

  • ప్రత్తిపాడులో చంద్రబాబు ప్రజాగళం సభ
  • టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా
  • ఈ ముఖ్యమంత్రి  ఫెయిల్ అంటూ వ్యాఖ్యలు
Chandrababu slams CM Jagan over age remarks

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల వేళ తుపానుగా మారి ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు  చేసి చెత్తకుండీలో వేయాలని పిలుపునిచ్చారు. 

"నేనొక విజన్ ఉన్న నాయకుడ్ని, 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారుచేసే వ్యక్తిని నేను. జగన్ నా వయసు గురించి మాట్లాడుతుంటాడు... అవును, నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను అవసరమైతే రోజులో 20 గంటలు కూడా పనిచేయగలను... జగన్ ఏసీ బస్సు దిగుతున్నాడా, ఎప్పుడైనా ఒక గంట మీ కోసం పనిచేశాడా, ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? ప్రజావేదిక కూల్చినప్పుడే అతడి మెదడులో ఏదో తేడా ఉందని చెప్పాను. అతడు కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడు.

ఒక్క చాన్స్ అని అడిగాడా, లేదా... తండ్రి లేని బిడ్డను అని చెప్పాడా, లేదా... ముద్దులు పెట్టాడా, లేదా... బుగ్గలు నిమిరాడా, లేదా... తలమీద చెయ్యి పెట్టాడా, లేదా... ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడా, లేదా...? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్లలో మీ జీవితాలు ఏమైనా మారాయా? 99 శాతం సమస్యలు పరిష్కారం చేశానని చెబుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్... ముఖ్యమంత్రిగా పనికిరాని మొద్దబ్బాయ్! ఈ ముఖ్యమంత్రికి వచ్చే మార్కులు సున్నా. 

కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పాడా, లేదా? ఉద్యోగాలు  వచ్చాయా, పరిశ్రమలు  తెచ్చాడా... అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. తిక్కలోడు మూడు ముక్కలాట ఆడడంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక్కడికి కారులో వస్తుంటే రోడ్డుపై ఉయ్యాల ఊగినట్టుంది. ఈ రోడ్లపై గుంతలకు తట్ట మట్టి వేయలేనివాడు మూడు రాజధానులు కడతాడంట. 

వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు... చేశాడా? ఇదీ ఆయన విశ్వసనీయత. ఇవాళ గుంటూరులో మీటింగ్ పెట్టాడు... అట్టర్ ఫ్లాప్. రూ.20 కోట్లు ఖర్చు పెట్టాడు. బిర్యానీ, క్వార్టర్ మందు ఇచ్చారు... బాగా తిని మీటింగ్ కు డుమ్మా కొట్టారు. మా మీటింగులకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను, పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలకు వెళితే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 

నిన్న గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టీనా టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు పుట్టినగడ్డపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి... మీ భవిష్యత్తుకు మేం భరోసా ఇస్తాం. 

ఎన్నికల ముందు... ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతే రాజధాని అని చెప్పాడా, లేదా? తాడేపల్లి కొంప కట్టాడా, లేదా? గృహప్రవేశం చేశాడా, లేదా? మిమ్మల్ని నమ్మించాడా, లేదా? ఇప్పుడు మూడు ముక్కలాట ఆడి మిమ్మల్ని మోసం చేశాడా, లేదా? 

దేశంలో ఐటీ ఉండాలని చెప్పిన మొట్టమొదటి నాయకుడ్ని నేనే. చెప్పి వదిలేయలేదు... కాలేజీలు పెట్టి, కంపెనీలు తీసుకువచ్చి, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రారంభించాను. అప్పట్లో జూబ్లీహిల్స్ కు మూడ్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎకరా లక్ష రూపాయలు. హైటెక్ సిటీతో కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి... అప్పుడు ఎకరా లక్ష రూపాయలు ఉన్న భూమి ఇప్పుడు ఎకరా రూ.100 కోట్లు. అదీ... సంపద సృష్టించే విధానం. 

కానీ అమరావతి ప్రాంతంలో 2019లో ఉన్న భూమి విలువ ఎంత, ఇప్పుడు విలువ ఎంత? ఇప్పుడు విలువ తగ్గిపోయిందా, లేదా? కొనేవాడు ఉన్నాడా? అభివృద్ధి జరిగితేనే భూమి విలువ పెరుగుతుంది. ప్రజలకు ఒక నమ్మకం ఉంటే భూములు కొంటారు, అమ్ముతారు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని తేలిపోయింది. జగన్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News