Congress: రాజకీయంగా ఎదుర్కోలేక మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారు: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

Venkatramireddy lashes out at bjp and congress
  • కాంగ్రెస్, బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను ఉన్నట్లుగా కథలు అల్లారని మండిపాటు
  • రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని చూస్తున్నాయన్న వెంకట్రామిరెడ్డి
కాంగ్రెస్, బీజేపీలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక... మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లుగా కథలు అల్లారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనపై ట్యాపింగ్ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇది బట్ట కాల్చి మీద వేయడమే అన్నారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని చూస్తున్నాయన్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు తాను నిజాయతీగా సేవలు అందించానన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. తాను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదన్నారు. తనకు ప్రజల అభిమానం ఉందని... అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తన మనోస్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు తన వైపే ఉన్నారన్నారు.
Congress
BJP
BRS
Medak District
Lok Sabha Polls

More Telugu News