Nara Lokesh: గాజువాకలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై నారా లోకేశ్ స్పందన

  • ఇంటి పట్టా కోసం స్థానిక నేతను ఆశ్రయించిన రాధ అనే మహిళ
  • డబ్బు అడిగిన నేత
  • మహిళ నిరాకరించడంతో అగ్నికి ఆహుతి చేసేందుకు యత్నం
  • విశాఖలో వైసీపీ అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోయిందన్న లోకేశ్ 
Nara Lokesh reacts on Gajuwaka incident

విశాఖపట్నం గాజువాకలో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి పేరు జలుమూరి రాధ. ప్రస్తుతం ఆమె విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

తన నివాసానికి పట్టా ఇప్పించాలని రాధ లోకనాథం అనే స్థానిక రాజకీయ నేతను ఆమె ఆశ్రయించింది. పట్టా ఇప్పించేందుకు లోకనాథం డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బు ఇచ్చేందుకు ఆమె నిరాకరించగా, ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో లోకనాథం... రాధపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

ఈ ఘటనపై బాధితురాలు రాధ పోలీసులను ఆశ్రయించింది. లోకనాథంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు లోకనాథం, శకుంతల, శ్యామలరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుళాయి వేయిస్తానని లోకనాథం రూ.20 వేలు తీసుకున్నాడని, ఇంటికి పన్ను పుస్తకం వచ్చేలా చేస్తానని రూ.30 వేలు అడిగాడని రాధ ఆరోపించారు. 

తాను ఒప్పుకోకపోవడంతో మనుషుల్ని వెంటేసుకుని గతంలో ఓసారి దాడికి వచ్చాడని, సీపీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని రాధ వాపోయింది. ఇప్పుడు మళ్లీ స్థల వివాదంలో గొడవపెట్టుకున్నాడని, తన ప్రాణానికి హాని ఉందని, రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. విశాఖలో వైసీపీ అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోయిందని మండిపడ్డారు. జలుమూరి రాధపై వైసీపీ నాయకుడి పెట్రోల్ దాడి యత్నం దారుణం అని విమర్శించారు.

జగన్ పాలనలో సొంత తల్లి, చెల్లికే రక్షణ లేదని పేర్కొన్నారు. ఇంటి పట్టాకు లంచం ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని లోకేశ్ నిలదీశారు. వైసీపీ నేత లోకనాథంను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు.

More Telugu News