plastic waste: భూమ్మీద పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 60 శాతం ఆ 12 దేశాల నుంచే.. తాజా రిపోర్టులో వెల్లడి

  • జాబితాలో భారత్ సహా అగ్రదేశాల పేర్లు
  • టాప్ లో చైనా తర్వాతి స్థానంలో అమెరికా
  • 2024లో మన దేశంలో 74 లక్షల టన్నుల వ్యర్థాలు
  • ఈఏ ఎర్త్‌ యాక్షన్‌ తాజా సర్వేలో వెల్లడి
India among 12 nations responsible for 60 Percent of mismanaged plastic waste

భూమి మీద గుట్టలుగుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోతోందని, ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికన్నా ఎక్కువ.. అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని స్విట్జర్లాండ్ కు చెందిన ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ జాబితాలో భారత్ పేరు కూడా ఉందని, అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. సగటున ఏటా తలసరి 8 కిలోల శుద్ధి చేయని వ్యర్థాలు భారత్ లో పేరుకుపోతున్నాయని వివరించింది. ఈ ఏడాది ఇలా పేరుకుపోయే చెత్త 74 లక్షల టన్నులకు చేరుతుందని, ఇది చాలా ఎక్కువ అని అభిప్రాయపడింది.

అయితే, మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో ప్లాస్టిక్ వ్యర్థాల మిస్ మేనేజ్ మెంట్ తక్కువని తెలిపింది. చైనాతో పోలిస్తే ఐదోవంతు కాగా, అమెరికా వ్యర్థాలలో మూడో వంతు మాత్రమేనని వివరించింది. ప్లాస్టిక్ మిస్ మేనేజ్ మెంట్ లో చైనా టాప్ లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉందని వివరించింది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన  22 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ఎర్త్ యాక్షన్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఐక్యరాజ్య సమితి అనుబంధ కమిటీ త్వరలో కెనడాలోని ఒట్టావాలో సమావేశం కానుంది. 

జాబితాలోని దేశాలు ఇవే..
అమెరికా, చైనా, భారత్‌, రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఈజిప్ట్‌, ఇండోనేసియా, టర్కీ, వియత్నాం

More Telugu News