YS Vimala: ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారు.. ఇకనైనా నోరు మూస్కోండి!: మేనత్త విమల

  • అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారన్న విమల
  • జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపాటు
  • షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్య
Sharmila and Sunita are causing trouble in the peaceful Pulivendu says YS Vimala

వివేకానందరెడ్డి హత్య విషయంలో సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల, సునీత విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుడు అవినాశ్ కు జగన్ మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల, సునీతలపై వారి మేనత్త వైఎస్ విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని విమల అన్నారు. ఇద్దరూ ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని మేనత్తగా చెపుతున్నానని హెచ్చరించారు. 

వైఎస్ ఉన్నప్పుడు కడపను వివేకానందరెడ్డి చూసుకున్నారని... ఇప్పుడు అవినాశ్ చూసుకుంటున్నారని విమల చెప్పారు. వైఎస్ ను ఇబ్బంది పెట్టిన వాళ్లంతా ఇప్పుడు షర్మిల పక్కన ఉన్నారని మండిపడ్డారు. షర్మిల, సునీతకు దైవభక్తి కూడా లేకుండా పోయిందని చెప్పారు. వీరిద్దరికీ తాను సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటి నుంచి... వాళ్లు తనతో మాట్లాడటం కూడా మానేశారని తెలిపారు. 

అవినాశ్ రాజకీయంగా ఎదగడాన్ని షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారని విమల చెప్పారు. అవినాశ్ గెలవాలని వివేకా చివరి రోజు వరకు పని చేశారని తెలిపారు. జగన్ ను, అవినాశ్ ను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని షర్మిల చేస్తున్నారని... ఆమె మాటలను నమ్మొద్దని చెప్పారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరినీ గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియోను చూశానని... షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బంధువులను ప్రభుత్వానికి దూరంగా ఉంచారని... ప్రభుత్వ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఉండరాదని భావించారని విమల చెప్పారు. వాళ్ల పనులు కావడం లేదనే షర్మిల, సునీత ఇలా వ్యవహరిస్తున్నారని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా ఇద్దరూ మారాలని మేనత్తగా చెపుతున్నానని అన్నారు. పేదల కోసం జగన్ ఎంతో చేస్తున్నారని... పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం తప్పు అని వ్యాఖ్యానించారు. మీరు చేస్తున్న పనుల వల్ల వైఎస్ ఆత్మ కూడా సంతోషంగా ఉందని అన్నారు.

More Telugu News