Joe Biden: ‘వద్దు..’ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్

Dont Biden warns Iran amid global jitters over likely attack on Israel
  • ఇజ్రాయెల్‌పై దాడుల కోసం ఇరాన్ మిసైల్స్‌ను సిద్ధం చేస్తోందంటూ వార్తలు
  • ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
  • దాడులకు దిగొద్దంటూ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక
  • తాము ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ పక్కన పెట్టాలని నిక్కచ్చిగా చెప్పేశారు. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం ఉందని మాత్రం ఆయన అంగీకరించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

‘‘ఇజ్రాయెల్ భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం. ఇజ్రాయెల్‌కు కచ్చితంగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ స్వీయరక్షణకు సహకరిస్తాం. ఇరాన్ విజయం సాధించలేదు’’ అని బైడెన్ పేర్కొన్నారు. 

మరోవైపు, ఇజ్రాయెల్‌‌‌పై దాడి కోసం ఇరాన్ 100 క్రూయిజ్ మిసైల్స్‌ను సిద్ధం చేసుకుందన్న వార్త సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు జరిపే అవకాశం ఉందని అమెరికా వర్గాలు భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇజ్రాయెల్‌‌పై నేరుగా దాడులకు దిగడంతో పాటూ ఇతరులతో కూడా దాడులు చేయించే అవకాశం ఉందని సమాచారం. 

అయితే, ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడుల నుంచి తనని తాను కాపాడుకోవడం ఇజ్రాయెల్‌కు సవాలేనని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ఉద్రిక్తతలు ముదరకుండా ఉండేందుకు ఇరాన్ స్వల్ప స్థాయి దాడులు చేసే ఆస్కారం ఉందని అమెరికా అంచనా వేసింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా సైనిక ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ సైన్యాధికారులతో సమావేశమై దాడులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లపై చర్చించారు. 

ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు అమెరికా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో రెండు యుద్ధ నౌకలను మోహరించింది. వీటిల్లో అత్యాధునిక ఏజిల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వెళ్లొద్దంటూ భారత్ సహా అనేక దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఇరాన్‌కు విమానసేవలను నిలిపివేసింది.
Joe Biden
Iran
Israel
Middle East

More Telugu News