KTR: రేవంత్ రెడ్డి నిజాయితీపరుడైన మోసగాడు... ఆయన అదృష్టంపై నాకు బాధ లేదు: కేటీఆర్

  • తాను బీజేపీలోకి వెళ్లనని రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని ప్రశ్న
  • కవిత అరెస్టుపై లీకులు ఇచ్చారని విమర్శ
  • మళ్లీ చెబుతున్నా... ఈడీ, మోదీ, బోడీ ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డికే శిక్ష పడలేదు... నన్ను అరెస్ట్ చేస్తారా? అన్న కేటీఆర్
KTR satires on Revanth Reddy

రేవంత్ రెడ్డి నిజాయతీపరుడైన మోసగాడని... ఆయన చెప్పి మరీ ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీవీ9 'క్రాస్ ఫైర్'లో ఆయన మాట్లాడుతూ... ప్రజలు మోసపోవాలని కోరుకుంటారని... కాబట్టి మేం వారిని మోసం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. అలా చెప్పి మరీ చేసినందుకు గాను ఆయన నిజాయతీ మోసగాడు అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు ముద్దాయి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. తాను బీజేపీలోకి వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వద్ద రేవంత్ రెడ్డి మాట చెల్లుతుందనేది వట్టిదే అన్నారు. అసలు ఆయన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి బీజేపీ నేతల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పట్ల తనకు ఎలాంటి విచారం లేదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో తనకూ దోస్తేనని... ముఖ్యమంత్రి అయ్యాడని... ఆయన అదృష్టవంతుడు అన్నారు. కానీ ఆయనకు పదవి వచ్చినందుకు తనకు ఎలాంటి విచారం లేదన్నారు. తన టార్గెట్ బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడం మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే బీఆర్ఎస్ ఉండాలన్నారు. బీఆర్ఎస్ బాగుంటే తెలంగాణ బాగుంటుందన్నారు.

కవిత అరెస్ట్‌పై రెండు నెలలుగా లీకులు

కవిత అరెస్ట్‌పై రెండు నెలలుగా లీకులు ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. 2023లో తొలుత బీజేపీ వాళ్లు లీకులు ఇచ్చారని, ఆ తర్వాత ఈడీ, సీబీఐ వచ్చి విచారణ చేశాయన్నారు. కవిత నిజంగానే తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇదో డైలీ సీరియల్ డ్రామాలా నడుస్తోందన్నారు. కవిత అకౌంట్ నుంచి డబ్బులు పోయాయా? వచ్చాయా? చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఈడీ, సీబీఐలను ప్రతిపక్షాల మీదికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ లొంగడు కాబట్టి జైల్లో పెట్టారన్నారు. అదానీ కోసం దేశంలో పాలసీలు మార్చిన ఘనత మోదీది అన్నారు. ఈ దేశంలో మీడియా అంతా మోదియా అయిపోయిందని ఎద్దేవా చేశారు.

మళ్లీ చెబుతున్నా... ఈడీ, మోదీ, బోడీ ఏం చేసుకుంటారో చేసుకోండి.. 

ఇదివరకు చెప్పాను... మళ్లీ చెబుతున్నాను... ఈడీ, మోదీ, బోడీ ఏం చేసుకుంటారో చేసుకోండి అని వ్యాఖ్యానించారు. తాము మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలకు దిగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని... బెదిరింపు పాలన అన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు సుభిక్షంగా పాలించాలని కోరుకుంటున్నానని... కానీ నల్గొండ, ఖమ్మం బాంబులు ఆయన పక్కనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండి 420 హామీలు అమలు చేయాలన్నారు. కానీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అన్నీ లెక్కలు చూశాకే హామీలు ఇస్తున్నామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తమకు రాముడితో ఎలాంటి తగాదా లేదని.. బీజేపీని మాత్రం తొక్కేస్తామన్నారు. 

రేవంత్ రెడ్డికే శిక్ష పడలేదు... నన్ను అరెస్ట్ చేస్తారా?

ఫోన్ ట్యాపింగ్ లేదా ఏ అంశలోనూ తాను తప్పు చేయలేదన్నారు. అలాంటప్పుడు తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఎనిమిదేళ్ళయినా ఇంకా శిక్ష పడలేదన్నారు. మన దేశంలో కసబ్ వంటి ఉగ్రవాదికే శిక్ష పడేందుకు ఏళ్లు పట్టిందన్నారు. మేం పదేళ్లలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను తప్పు చేసి ఉంటే కేసు పెట్టుకొని.. ఏం చేస్తారో చేసుకోండన్నారు. బీఆర్ఎస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయేవాళ్లు వెళ్లవచ్చునన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.

More Telugu News