Chandrababu: ఈ ఐదేళ్లలో బాగుపడింది ఈ ఐదుగురే: రేపల్లెలో చంద్రబాబు

  • బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగళం సభ
  • ఇప్పటికీ తాను కుర్రాళ్లలానే ఆలోచిస్తానన్న చంద్రబాబు
  • జగన్ శవాలతో వస్తున్నాడని, తాము నేతలతో కలిసి వస్తున్నామని వెల్లడి
  • సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని విమర్శలు
Chandrababu speech in Repalle

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 1995లో విజన్ 2020 తీసుకువచ్చానని, ఇప్పుడు తనకు 73 ఏళ్లయినా నవయువకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో, అవన్నీ తీసుకువచ్చి మన పిల్లలకు అందించాలన్నదే తన ఆలోచన అని వివరించారు. 

"జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య నేనొక్కడినే వస్తున్నాను... నేను ఒంటరిని అంటున్నాడు. ఆయన ఒంటరి కాదు... శవాలతో వస్తున్నాడు... నేను నాయకులతో వస్తున్నాను. ఆయన శవరాజకీయాలు చేస్తాడు... నేను ప్రజారాజకీయాలు, పేదల కోసం రాజకీయాలు చేస్తాను. 

ఈ జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపారు. ఈ ముఖ్యమంత్రి పరామర్శించాడా? అదే, టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు చేసిన పార్టీ మాది. అంత కఠినంగా వ్యవహరించాం. చంపినవాళ్లు ఊళ్లో తిరుగుతూ ఇంకా బాధితులను బెదిరిస్తూనే ఉన్నారు. 

పదవిని మేం బాధ్యతగా భావించాం... వాళ్లు పదవిని వ్యాపారంగా భావించారు. జగన్ వస్తే పోలవరం పూర్తి కాదని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తాం అని చెప్పాను... కానీ మీరు వినలేదు. ఇవాళ పోలవరం ఏమైందో చూడండి... పోలవరంను గోదావరిలో కలిపేశాడు. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందో, లేదో తెలియదు. 

మరో విషయం కూడా చెప్పాను... ఇసుక దోపిడీ చేస్తారు, బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారు అని చెప్పాను. ఇప్పుడు ఇసుక, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో చూశారు. అమరావతిని చెడగొడతాడు అని కూడా అప్పుడు చెప్పాను. 

ఇవాళ చూడండి... అమరావతి పూర్తిగా విధ్వంసం అయింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి రాష్ట్రమంతటా దారుణంగా మార్చేశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణతో పోల్చితే ఏపీలోచ్చాక పేదవాళ్ల సంఖ్య పెరిగింది. 

నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను... కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అంతంతమాత్రంగా చేశారు, కొంతమంది ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ, దేశ చరిత్రలోనే ఓ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఒకటీ రెండు కాదు... అన్ని రంగాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని అందరినీ భ్రష్టుపట్టించాడు. ఇక్కడ తుపాను వస్తే నేను వచ్చి పరామర్శించాను... కనీసం ఈ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడా? 

రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఎవరైనా బాగుపడ్డారా? ఈ ఐదేళ్లలో బాగుపడింది ఐదుగురే. వాళ్లలో మొదటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, ఐదో వ్యక్తి పెద్దిరెడ్డి... వీళ్లుకాక ఇంకెవరైనా బాగుపడ్డారా? 

ఇప్పుడు కొత్తగా క్లాస్ వార్ అంటున్నాడు... నేను చెబుతున్నా ఇది క్యాష్ వార్. టీడీపీ హయాంలో కరెంటు చార్జీలు పెరిగాయా? అప్పుడు రూ.200 ఉన్న కరెంటు ఇప్పుడు రూ.2 వేలకు పెరిగింది. ఇప్పుడా బిల్లు చూపి ఈ దుర్మార్గులను ఎండగట్టండి. మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచాడు. ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేశాడు. పొరుగు రాష్ట్రాల్లో అన్న క్యాంటీన్లు ఉంటే, మన రాష్ట్రంలో ఉంటే తప్పేంటి? 

ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.200. పదే పదే అబద్ధాలు చెబుతున్నాడు... ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చాడట. నువ్వు నెరవేర్చింది గుండు సున్నా...! కరెంటు చార్జీలు పెంచనన్నావు, మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నావు... ఇన్ని చెప్పావు. ఆ నాలుకకు ఏ మాత్రం మడతే లేదు... చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా కొత్త అబద్ధాలు చెప్పడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట. 

ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1000... ఇప్పుడు అది రూ.5000... ఈ డబ్బంతా జగన్ కు పోతోంది. నీతిమంతమైన పాలన ఇస్తున్నాడంట... నీతి! ఇలా చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి" అని పిలుపునిచ్చారు.

More Telugu News