Nara Lokesh: బెంగళూరులో ప్రచారానికి లోకే‌శ్‌ను ఆహ్వానించిన తేజస్వీ సూర్య

  • తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి మద్దతుగా కోయంబత్తూరులో లోకేశ్ ప్రచారం
  • అభివృద్ధిలో చెన్నై వెనకబడడానికి కారణం విజనరీ లీడర్‌షిప్ లేకపోవడమే కారణమని విమర్శ
  • రాజకీయాల్లో రాణించడం అంత ఈజీకాదన్న యువనేత
  • ప్రపంచం ఇప్పుడు కోయంబత్తూరు వైపు చూస్తోందన్న బీజపీ ఎంపీ తేజస్వీ సూర్య
  • ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టి పునర్నిర్మాణం చేస్తారని ఆశాభావం
BJP MP Tejasvi Surya invited Nara Lokesh to campaign in Bangalore

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా కోయంబత్తూరులో ప్రచారం చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ఆహ్వానించారు.  బెంగళూరు వచ్చి తమ నియోజకవర్గంలోనూ ప్రచారం చేయాలని కోరారు. కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు పోటీపడుతున్న అన్నామలైకి మద్దతుగా నిన్న ప్రచారం చేసిన లోకేశ్, నేడు కూడా ప్రచారం చేయనున్నారు.  సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్‌లో లోకేశ్ నిన్న తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కళాకారులు చేసిన శాలువతో అన్నామలైని లోకేశ్ సత్కరించారు. ప్రతిగా కోయంబత్తూరు శాలువతో ఆయన లోకేశ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోలిస్తే చెన్నై వెనకబడిపోవడానికి విజనరీ లీడర్‌షిప్ లేకపోవడమే కారణమని విమర్శించారు. ఒక్క పరిశ్రమ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో తమకు తెలుసని, నాడు తమిళనాడుతో పోటీపడి కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించామని గుర్తుచేసుకున్నారు. 

రాజకీయాలు ఈజీ కాదు..
దేశ ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది చంద్రబాబు సంకల్పమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు అంత ఈజీ కాదన్నారు. ఐపీఎస్‌ను త్యాగం చేసి అన్నామలై రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. కోయంబత్తూరులో ఇన్‌ఫ్రా, తాగునీటి సమస్యలు పరిష్కరించాల్సి ఉందని,  హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్, ఫౌండ్రీ పరిశ్రమను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టాలంటే అన్నామలై లాంటి పోరాటయోధుడు కోయంబత్తూరుకు అవసరమన్నారు.  ఈ ఎన్నికల్లో అన్నామలై ఘనవిజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడతారని బలంగా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. 

ప్రపంచం చూపు కోయంబత్తూరు వైపు
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోయంబత్తూరు వైపు చూస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. చదువుకున్నవారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడం విచారకరమన్న ఆయన.. ఈనెల 19న జరిగే ఎన్నికల్లో అన్నామలైకు మద్దతుగా యువత ఓట్లరూపంలో సంఘీభావం తెలపాలని కోరారు.

 అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్
బీజేపీ అభ్యర్థి అన్నామలై మాట్లాడుతూ.. కోయంబత్తూరు అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా ఉందని విమర్శించారు. రాబోయే 20 ఏళ్లు కోయంబత్తూరు అభివృద్ధికి 140 అంశాలతో డాక్యుమెంట్ రూపొందించినట్టు తెెలిపారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా కోయంబత్తూరులో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా నారా లోకేశ్ ఇక్కడి సమస్యలపై అధ్యయనం చేశారని, చంద్రబాబు అధికారం చేపట్టి ఏపీ పునర్నిర్మాణం చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కోయంబత్తూరు అభివృద్ధికి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నామలై పేర్కొన్నారు.

More Telugu News