Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ

Jammu and Kashmir will get status of statehood PM Modi says in Udhampur
  • అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని హామీ
  • జమ్మూ కశ్మీర్‌లోని లక్షలాది కుటుంబాలకు రాబోయే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ వాగ్దానం చేసిన మోదీ
  • ఉధంపూర్‌ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు ప్రధాని ప్రచారం 
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ ప్రసంగించారు. ‘‘నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్ము కశ్మీర్‌లో అమ్మలు, అక్కాచెల్లెళ్లకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేదలు రోజుకు రెండు పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. నేడు జమ్మూ కశ్మీర్‌లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నాను’’ అని మోదీ హామీ ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని, దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్నాయని మోదీ అన్నారు. ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పుడే సవాళ్లను అధిగమించగలమని, పనులను పూర్తి చేయగలమని అన్నారు. బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఇక్కడి షాపుర్‌కండీ డ్యామ్‌ను ఎలా స్తంభింపజేశాయో గుర్తుండే ఉంటుందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పనితీరు ఫలితంగా జమ్మూ రైతుల పొలాలు ఎండిపోయాయని, గ్రామాలు చీకటిలో మగ్గాయని మోదీ విమర్శలు గుప్పించారు. మన రావి నది నీళ్లు పాకిస్థాన్‌కు పోతుండేవని, రైతులకు హామీ ఇచ్చిన మోదీ నిలబెట్టుకున్నారని అన్నారు.

కాగా ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఉధంపూర్‌లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశాయి. బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ల ఎగరవేతపై బ్యాన్ విధించారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బీజేపీ తరపున ఇక్కడ పోటీ చేస్తున్నారు. వరుసగా మూడోసారి తిరిగి ఎన్నికవ్వడమే లక్ష్యంగా ఆయన ప్రచారం చేస్తున్నారు.
Jammu And Kashmir
Narendra Modi
BJP
Udhampur
Lok Sabha Polls

More Telugu News