Maldives: భారత్‌లో మాల్దీవుల రోడ్‌షోలు.. టూరిస్టులను తిరిగి ఆకర్షించేందుకు ప్రణాళికలు

Maldives to hold Roadshows In India To Boost Travel Amid Strained Ties
  • భారతీయ పర్యాటకులను తిరిగి ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు
  • ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు
  • మాలేలోని భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపిన మాల్దీవుల ప్రముఖ పర్యాటక సంస్థ
భారత్‌తో లేనిపోని వివాదాన్ని సృష్టించుకొని.. పర్యాటకులను దూరం చేసుకుని పర్యాటక రంగాన్ని నష్టపరుచుకుంటున్న మాల్దీవులు దేశం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తిరిగి భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత్‌లో రోడ్ షోలు నిర్వహించనున్నట్టు మాల్దీవులకు చెందిన ఒక ప్రధాన పర్యాటక సంస్థ మటాటో (మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్) ప్రకటించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లిన వేళ మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో టూరిస్టులను తిరిగి ఆకట్టుకోవాలనే లక్ష్యంతో మటాటో అడుగులు వేస్తోంది. పర్యాటక సహకారాన్ని పెంపొందించుకునేందుకు రోడ్‌షోలు నిర్వహించుకుంటామంటూ మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌తో మటాటో చర్చలు జరిపింది.

పర్యాటక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి సహకరించాలని భారత హైకమిషన్‌ను మటాటో ప్రతినిధులు కోరారు. భారతీయ ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకుంటామని కోరారు. నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాలు ఉంటాయని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు ఎక్స్ వేదికగా మటాటో వెల్లడించింది. మాల్దీవుల పర్యాటక రంగానికి కీలకంగా ఉన్న భారత్‌లోని పర్యాటకులను మరింత ప్రోత్సహించడానికి ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌లు, పర్యాటర రంగ భాగస్వాములు ఎదురుచూస్తున్నారని పేర్కొంది.

కాగా ఈ ఏడాది జనవరి 6న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి అక్కడ సుందర దీవుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పర్యటించాలంటూ భారతీయులను ప్రోత్సహించారు. అయితే ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టుపై మాల్దీవుల మంత్రులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా మోదీ, భారత్‌లో బీచ్‌లను అవహేళన చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులు గట్టి కౌంటర్లు ఇచ్చారు. ‘మాల్దీవుల పర్యటనలకు వెళ్లబోం’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో వేలాది సంఖ్యలో భారతీయులు మాల్దీవుల టూర్‌ను రద్దు చేసుకున్నారు. ఫలితంగా అక్కడి పర్యాటకరంగం తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
Maldives
India
Tourism
MATATO
Narendra Modi

More Telugu News