Hyderabad: కుమారుడు ప్రయోజకుడు కాలేదన్న మనస్తాపంతో పదో అంతస్తు నుంచి దూకి తండ్రి ఆత్మహత్య

  • ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న దేవిదాస్ అగర్వాల్
  • క్యాబ్ కొనేందుకు తండ్రి ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేసిన కుమారుడు
  • ఈ విషయమై ఇంట్లో గొడవలు
  • మనస్తాపంతో దేవిదాస్ ఆత్మహత్య
Man committed suicide by jumping from 10th floor

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వైపు కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతుండడం, మరోవైపు, చేతికి అందిరావాల్సిన కుమారుడు ఎందుకూ కొరగాకుండా పోవడంతో మనస్తాపం చెందిన ఓ తండ్రి పదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో నిన్న జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన దేవిదాస్ అగర్వాల్  (50) ఎల్ఐసీ ఏజెంట్. మూడేళ్లుగా ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్నాడు. కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కుమారుడు మహదేవ్ క్యాబ్ డ్రైవర్. ఇటీవలే వివాహం జరిగింది. కారు కొనేందుకు తండ్రి ఇటీవల ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేశాడు. 

ఈ విషయమై కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన దేవిదాస్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అద్దెకు ఓ పోర్షన్ కావాలని అడిగారు. పదో అంతస్తులో ఉందని కాపలాదారుడు చెప్పడంతో పైకి వెళ్లిన అగర్వాల్ అక్కడి నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News