Pawan Kalyan: మా అన్నయ్య నాకు నేర్పించిన స్కిల్ ఇవాళ నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది: పవన్ కల్యాణ్

  • కోనసీమ జిల్లా పి.గన్నవరంలో సభ
  • హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
  • బీసీలకు న్యాయం చేసేది ఎన్డీయే కూటమి మాత్రమేనన్న పవన్
Pawan Kalyan speech in P Gannavaram

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన కూటమి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార, తర్క శాస్త్ర పండితుడు జగన్నాథ పండిత రాయలు పుట్టిన నేల అని అభివర్ణించారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు... ముస్లిం సోదరసోదరీమణులందరికీ కూటమి తరఫున రంజాన్ శుభాకాంక్షలు  తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. సామాజిక న్యాయ కోసం పాటుపడిన కృషీవలుడు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా చెబుతున్నాను... బీసీలకు న్యాయం చేసేది ఎన్డీయే కూటమి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. 

"కోనసీమ... ఇది కలహాల సీమ కాదు... ప్రేమ సీమ. కొబ్బరి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనసున్న కోనసీమను జగన్ వచ్చి కలహాల సీమగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ ప్రయత్నాన్ని మేం అడ్డుకున్నాం. రెండున్నర లక్షల హెక్టార్లలో కొబ్బరితోటలతో నిండిన ఈ అందాలసీమను తిరిగి ప్రేమ సీమగా మార్చుకునేందుకు శాయశక్తులా కృషి చేశాం. 

భవిష్యత్తులోనూ అన్ని కులాల మధ్య సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం... శెట్టిబలిజలు, కాపులు, మాలలు, మాదిగలు, క్షత్రియులు, వాడబలిజలు, మత్స్యకారులు, బీసీల్లో సంఖ్యాబలం లేని 127 కులాలు, ముస్లింలు... అందరూ అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. 

నాడు క్లేమోర్ మైన్లు పేలినా చలించకుండా, చొక్కా దులుపుకుని ముందుకు వచ్చిన వ్యక్తి, నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు... ఇవాళ మేమందరం కలిసి వచ్చాం. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు... ఒక దేశానికి ఒక నది సరిపోదు... ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ త్రివేణి సంగమం లాగా ఏర్పడ్డాయి. మీ అందరి భవిష్యత్తు కోసమే కూటమిగా మారాం. 

ఇక్కడ రెండున్నర లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో కొబ్బరి బోర్డు లేదు. ఈ ప్రభుత్వం ఇక్కడ చేపట్టిన నాడు-నేడు పనులు ఏమాత్రం ముందుకు వెళ్లలేదు. వైసీపీది ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని ప్రభుత్వం... ఇలాంటి ప్రభుత్వం కావాలా? 

కోనసీమలో ఓ సంప్రదాయం ఉంది... కొబ్బరిచెట్టును పెద్దకొడుకుగా భావిస్తారు. ఒకప్పుడు ఎకరా కొబ్బరితోటలో వెయ్యి కాయల వరకు వచ్చేవి... ఇప్పుడు కనీసం 200 కాయలు కూడా రావడంలేదు. ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి రైతుల పరిస్థితి కూడా బాగాలేదు... కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ అండగా ఉంటాను. ఈసారి నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటాను. మా కూటమిలో ప్రతి ఒక్కరం కాటన్ దొరలా ప్రజల కోసం పనిచేస్తాం. 

నా దృష్టికి ఓ విషయం వచ్చింది. కొబ్బరి కాయల్లో గంగా బోండాలు అనే రకం ఉంది. వీటిల్లో చాలా ఎక్కువ నీళ్లు ఉంటాయి. గంగా బోండాలు ఏ కోనసీమ కోసం అయితే ఉద్దేశించబడ్డాయో ఆ గంగా బోండం కొబ్బరి మొక్కలు ఇక్కడ దొరకడంలేదు. ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నేతలకు వేలాది గంగా బోండం కొబ్బరి మొక్కలు వెళుతున్నాయి కానీ, ఇక్కడి రైతులకు దొరకడంలేదు. కోనసీమ రైతులకు ఒక్క మొక్క కావాలన్నా అనేక ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మా ప్రభుత్వం రాగానే గంగా బోండం మొక్కలు అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తాం. 

రైతులకు అండగా ఉండాల్సిన ఆర్బీకేలు కాకినాడలోని మాఫియా డాన్ వద్దకు వెళ్లిపోయాయి... ఆ డాన్ ఎవరో మీకు తెలుసు... అతడికి వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తున్నాం... జగన్ పెట్టుకున్న మాఫియా డాన్లను తన్ని, తగలేసి, తరిమేసే వరకు మేం నిద్రపోం. వాళ్లందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత ఒకటి ఆలోచించాలి... కులాలు, మతాలు దాటి ఆలోచించకపోతే రాష్ట్రంలో అందరం నష్టపోతాం. 

ఇందాక చంద్రబాబు కూడా చెప్పారు... నేను ఏదైనా మాట్లాడితే నా కులం నాయకులతో తిట్టిస్తారు... బీసీలతో తిట్టిస్తారు, ఎస్సీ కులం నాయకులతో తిట్టిస్తారు... అలాగని అందరు కాపు నాయకులు తిట్టడంలేదు, అందరు బీసీ నేతలు తిట్టడంలేదు, అందరు ఎస్సీ నేతలు తిట్టడంలేదు... ఒకరో ఇద్దరో ఉన్నారు... నేను కాదనడంలేదు... యువతకు ఉపాధి అవకాశాల కోసం, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడవడానికి నేను ఇవన్నీ భరిస్తున్నాను. 

లండన్ లో నేను అంబేద్కర్ భవన్ కు వెళ్లాను. అక్కడ అంబేద్కర్ ఫొటోలు గొప్పగా ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్య పథకం తీసుకువస్తే, అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య పథకం అని పేరుపెట్టుకున్నారు... ఆ పథకానికి కూడా డబ్బులు ఇవ్వడంలేదు. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్య పథకం అని నామకరణం చేస్తాం. 

ఎక్కడైనా యువతకు నైపుణ్యాభివృద్ధి చాలా కీలకం. బైబిల్ లో చెప్పినట్టుగా చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి... ఆ విధంగానే యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలి. మా అన్నయ్య చిరంజీవి నాకు నేర్పించిన స్కిల్ ఇవాళ నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది. ఆ విధంగానే ప్రతి యువకుడిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు గారికి సూచిస్తున్నాను..." అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

More Telugu News