Chandrababu: ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు: చంద్రబాబు

  • పి.గన్నవరంలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ప్రజల్లో ఇవాళ అభద్రతా భావం కనిపిస్తోందన్న చంద్రబాబు
  • జగన్ జనాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నాడని ఆగ్రహం
Chandrababu speech in P Gannavaram Praja Galam

టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక చాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు... మీలో బాధ, ఆవేదన చూశాను... మీలో అభద్రతా భావం కనిపిస్తోంది....  ఇవాళ, నేను పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు... సిద్ధం సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పారు... దానికి మీరు సిద్ధమా? అని అడిగారు.

ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు... పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్లతో మాటల దాడి చేయిస్తాడు... నేను మాట్లాడితే నా కులం వాళ్లను ఎగదోసి బూతులు తిట్టించాడు... అందుకే చెబుతున్నా... మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి... మళ్లీ ఇంట్లోంచి బయటికి రాకుండా చితక్కొట్టండి... అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ఆ ముగ్గురు నాయకుల సాక్షిగా చెబుతున్నా

బాలయోగి గారు నాకు చిరకాల మిత్రుడు. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయినా ఆయన మీ హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు. బాలయోగిని స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీది. 

ఇవాళ మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి. మొన్ననే బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి జరుపుకున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం... బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మేం స్వీకరిస్తున్నాం. బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించాం. ఈ డిక్లరేషన్ తో బీసీల తలరాత మారుతుంది. 

50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం. సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేలు... ఐదేళ్లలో రూ.1.50 లక్షలతో బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకువస్తాం. ఇదే కాదు... స్థానిక సంస్థల్లో మళ్లీ 34 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం. 

చట్టసభల్లోనూ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం, న్యాయం జరిపిస్తాం, తీర్మానం చేస్తాం. చట్టబద్ధంగా కులగణన చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. ఆదరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా రూ.10 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటాం. 

చెక్ పెట్టేందుకు ఇదే సమయం

రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదొక కీలక సమయం. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు, కష్టాలకు చెక్ పెట్టే సమయం ఇది. ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా, ఏ ఒక్కరికైనా, ఏ వర్గానికైనా, ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా? 

2014-19 మధ్య రూ.200 ఉన్న విద్యుత్ చార్జీ ఇవాళ రెండు వేలు అయింది. రూ.200గా ఉన్న విద్యుత్ చార్జీని రెండు వేలకు పెంచి, 99 శాతం హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పే ప్రభుత్వం మీకు కావాలా? ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా లేదా? కడుపు నిండా తినే పరిస్థితిలో ఉన్నారా? ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగాయా లేదా? పన్నులు పెంచేశారు... చెత్తమీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్నేశాడు. రాష్ట్రంలో విధ్వంస పాలన నెలకొంది. 

చిచ్చు పెట్టి చలికాచుకుంటున్నాడు

కోనసీమ... అందాలసీమ. సినిమాల్లో అందమైన లొకేషన్లు చూపించాలంటే... మా పవన్ కల్యాణ్ తో సహా అందరూ చూపించేది మొదట కోనసీమనే. ఇప్పుడు ఈ ప్రాంతం అంబేద్కర్ కోనసీమ అయింది. ఇక్కడ ఎవరైనా చెడ్డవ్యక్తులు ఉన్నారా? ఎవరైనా మంచి నీళ్లు ఇవ్వమంటే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనస్తత్వం కోనసీమ వాసుల సొంతం. ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ ను ఇప్పటికీ ఆరాధిస్తుంటారు. 

అలాంటి కోనసీమలో కశ్మీర్ మాదిరిగా ఇంటర్నెట్ నిలిపివేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. ఒకప్పుడు పౌరుషంగా కూడా మాట్లాడడం తెలియని ఈ గోదావరి ప్రజల మధ్య జగన్ చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నాడు. 

మొదటి సంతకం దానిపైనే!

యువతకు ఉద్యోగాలు వచ్చాయా, డీఎస్సీ జరిపారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే మా కూటమి రావాలి. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది... అదీ మా కమిట్ మెంట్. మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడే గోదావరి ఉంది... అయినా మీకు ఇసుక దొరుకుతోందా?

టీడీపీ హయాంలో రూ.1000గా ఉన్న ఇసుక ట్రాక్టర్ ఇప్పుడు రూ.5 వేలు... ఎవరికి పోతోంది ఈ డబ్బు? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా కనిపిస్తోంది. 

ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు. టీడీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడు క్వార్టర్ బ్యాటిల్ రూ.200... రూ.160 తేడా ఉంది... ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది. 

పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయేకు సహకరించారు. అందుకే ఆనాడు గోదావరి జిల్లాల్లో వన్ సైడెడ్ ఎలక్షన్ల జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం... నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కూడా మాతో కలిసింది... ఇక తిరుగుందా? మాకు ఎదురుగా నిలబడే దమ్ము జగన్ కు ఉందా? 

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయినా బాగున్నాడా? ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు.... వారిని కూడా అడుగుతున్నా. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత ఉండేది... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే  గ్యారెంటీ లేని పరిస్థితి. 

ఇవాళ తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో శంకర్రావు అనే కానిస్టేబుల్ విశాఖలతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులను అడుగుతున్నా... మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చాడా...? టీఏ, డీఏ, పీఎఫ్ అన్నీ పెండింగ్ పెట్టాడు. దాంతో కానిస్టేబుల్ శంకర్రావు దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ పి.గన్నవరం వంటి ప్రాంతాల్లోనూ గంజాయి దొరికే పరిస్థితులు ఉన్నాయి. 

కాపుల్లో కూడా పేదరికం ఉంది

ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేసిన పార్టీ టీడీపీ. ఈ ముఖ్యమంత్రి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పాడు... మాట నిలబెట్టుకున్నాడా?" అన్నారు చంద్రబాబు  

More Telugu News