CBI: జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఏమిటీ పీటీ వారెంట్​?

  • ఓ కేసులో జైలులో ఉన్నవారిని మరో కేసులో అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే పీటీ వారెంట్
  • రెండో కేసుకు సంబంధించి మరో కోర్టు ఎదుట హాజరు
  • రెండింట్లోనూ బెయిల్ వస్తేనే.. జైలు నుంచి బయటికి..
what is PT warrant How CBI arrested her from Jail

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. తాజాగా సీబీఐ పీటీ వారెంట్ తో అరెస్టు చేసింది. మరి ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి? అసలు పీటీ వారెంట్ అంటే ఏమిటనే సందేహాలు ఉన్నాయా?.. వాటికి సమాధానాలివీ..

ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ – పీటీ వారెంట్..

  • ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న నిందితులను... మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదా అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్’.
  • కోర్టు ఎవరినైనా జ్యుడిషియల్ రిమాండ్ కింద జైలుకు పంపినప్పుడు.. సదరు నిందితులు పూర్తిగా ఆ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నట్టు లెక్క. నిందితులు జైలులో ఉన్నా.. వారికి సంబంధించిన ఏ వ్యవహారమైనా వారిని రిమాండ్ కు పంపిన కోర్టు అనుమతితోనే చేయాల్సి ఉంటుంది.
  • ఆ నిందితులను వేరే కేసులో అరెస్టు చేయాల్సి వస్తే.. పోలీసులు సదరు కోర్టుకు వెళ్లి అనుమతి కోరుతారు. ఏ కేసులో, ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదో వివరిస్తారు. ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్’ ఇచ్చి ఆ నిందితులను తమకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
  • కోర్టు దీనికి ఓకే చెప్పి ‘పీటీ వారంట్’ జారీ చేస్తే.. దానిని తీసుకెళ్లి జైలు అధికారులకు చూపించి.. సదరు నిందితులను తమ అదుపులోకి తీసుకుంటారు. తాము దర్యాప్తు చేయాల్సిన ఆ మరో కేసుకు సంబంధించిన వివరాలను సదరు నిందితుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 

తిరిగి కోర్టులో హాజరు పర్చాల్సిందే..
పోలీసులు నిందితులను ట్రాన్సిట్ వారంట్ పై అరెస్టు చేసినా.. నిబంధనల ప్రకారం 24 గంటలలోగా తాము దర్యాప్తు చేస్తున్న ఆ మరో కేసుకు సంబంధించిన కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈ కోర్టు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే.. ఈ కోర్టు పరిధిలోని జైలుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసు కస్టడీకి ఈ కోర్టు అనుమతి ఇస్తే.. ఆ గడువు వరకు పోలీసులు నిందితులను తీసుకెళ్లి వివరంగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది.

రెండు చోట్లా బెయిల్ వస్తేనే బయటికి..
  • ఇలా పీటీ వారంట్ పై ఉన్న నిందితులకు.. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అవుతారు. లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
  • ప్రస్తుతం కవితను తొలుత ఈడీ అరెస్టు చేసి.. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడిషియల్ రిమాండ్ కింద తీహార్ జైలుకు పంపింది.
  • ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేయడంతో.. ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ఆ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కింద ఏ జైలుకు పంపితే.. ఆ జైలుకు కవితను తరలిస్తారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు.
  • ఒకవేళ కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ అరెస్టు నేపథ్యంలో జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికి విడుదల అవుతారు.

More Telugu News