G. Kishan Reddy: కాంగ్రెస్ గెలిస్తే మతకల్లోలాలు, కర్ఫ్యులే ఉంటాయి: కిషన్ రెడ్డి హెచ్చరిక

  • తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ధ్వజం
  • కాంగ్రెస్ తెలంగాణలో తెచ్చిన మార్పు ఇదేనా? అని నిలదీత
  • కేంద్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధాని మారుతారని ఎద్దేవా
Kishan Reddy warning about congress

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మతకల్లోలాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు... ఇలా అందరినీ బెదిరించి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ తెలంగాణలో తెచ్చిన మార్పు ఇదేనా? అని నిలదీశారు.

ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. కలగూర గంపతో కూడిన పార్టీలు అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తు దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి మోదీ నాయకత్వంలో బీజేపీ గెలవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు.

More Telugu News