IPhone Alert: ఐఫోన్ లో స్పై వేర్.. భారత కస్టమర్లకు యాపిల్ కంపెనీ అలర్ట్

  • కొన్ని ఫోన్లలోకి పెగాసస్ తరహా స్పై వేర్ చేరిందని అనుమానాలు
  • భారత్ సహా 91 దేశాలలోని తన కస్టమర్లకు థ్రెట్ నోటీసులు
  • గతేడాది అక్టోబర్ లో పెగాసస్ స్పై వేర్ పై ఇదేవిధంగా అలర్ట్ చేసిన కంపెనీ
Apple warns some Indian users their iPhone may be bugged by spyware

భారత్ లోని తన కస్టమర్లకు యాపిల్ కంపెనీ తాజాగా అలర్ట్ నోటీసులు పంపింది. ఐఫోన్ వినియోగదారుల్లో పలువురి ఫోన్లను స్పై వేర్ అటాక్ చేసిందని హెచ్చరించింది. పెగాసస్ తరహాలో ఈ స్పైవేర్ ఇప్పటికే పలు ఫోన్లలోకి చేరినట్లు అనుమానం వ్యక్తం చేసింది. భారత్ తో పాటు ప్రపంచంలోని 91 దేశాల కస్టమర్లకు ఇలా థ్రెట్ నోటీసులు పంపినట్లు సమాచారం. యాపిల్ కంపెనీ ఇలా హెచ్చరికలు చేయడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్ లో భారత్ లోని పలువురు సెలబ్రెటీలు, ప్రతిపక్ష నేతలను అలర్ట్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, టీఎంసీ లీడర్ మహువా మొయిత్రాల ఫోన్లలో పెగాసస్ స్పై వేర్ చేరిందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ స్పై వేర్ అటాక్ వెనక ప్రభుత్వ హస్తం ఉందన్న యాపిల్ కంపెనీ.. ఆ తర్వాత మాటమార్చింది. ప్రభుత్వ హస్తం ఉందనేందుకు ఆధారాలు లేవని వివరణ ఇచ్చింది.

తాజాగా గురువారం మధ్యాహ్నం పంపిన థ్రెట్ అలర్ట్ లలో భారత్ లోని పలువురు ఐఫోన్ యూజర్లు ఈ స్పై వేర్ బారిన పడినట్లు యాపిల్ పేర్కొంది. మెర్సినరీ స్పై వేర్ గా వ్యవహరిస్తున్న ఈ స్పై వేర్ ఉనికిని గుర్తించినట్లు చెప్పింది. ‘మీ ఫోన్ మెర్సినరీ స్పై వేర్ అటాక్ కు గురైనట్లు గుర్తించాం. మీ ఐడీ సహా మా దగ్గర ఉన్న మీ వివరాల ఆధారంగా ఈ విషయం తెలిసింది. మీ వృత్తి కారణంగానే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఈ స్పై వేర్ అటాక్ జరిగింది. సాధారణంగా ఇలాంటి స్పై వేర్ అటాక్ ల గుర్తింపు, నిర్ధారణపై వందకు వంద శాతం గ్యారంటీ ఉండదు. అయితే, మీ ఫోన్ అటాక్ కు గురైందనే విషయంలో పూర్తి క్లారిటీతోనే మేము ఈ నోటీసులు పంపుతున్నాం. అందువల్ల ఈ నోటీసులను సీరియస్ గా తీసుకోండి’ అంటూ యాపిల్ తన నోటీసులలో పేర్కొంది.

More Telugu News