IPL 2024: ఓటమి బాధలో ఉన్న సంజు శాంస‌న్‌కు షాక్.. రాజ‌స్థాన్ సార‌ధికి భారీ జ‌రిమానా!

  • సంజు శాంస‌న్‌కు రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా
  • 'స్లో ఓవ‌ర్ రేట్' కార‌ణంగానే ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ వెల్ల‌డి
  • నిన్న జైపూర్‌ వేదిక‌గా ఆర్ఆర్‌, జీటీ మ‌ధ్య‌ మ్యాచ్‌
  • చివ‌రి బంతికి ఓడిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌
Rajasthan Royals Skipper Sanju Samson Fined Rs 12 Lakh for Slow Over Rate

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) కెప్టెన్ సంజు శాంస‌న్‌కు భారీ జ‌రిమానా ప‌డింది. బుధ‌వారం గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) తో జైపూర్‌ వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అత‌డికి రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. "మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో సంజుకు రూ. 12 లక్షల జరిమానా విధించడం జ‌రిగింది" అని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇప్ప‌టికే గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌భ్ పంత్‌కు కూడా ఇదే కార‌ణంతో ఐపీఎల్ కౌన్సిల్‌ జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే.  
 
మ‌రోవైపు నిన్న‌టి మ్యాచులో ప‌రాజ‌యంతో సంజు శాంస‌న్‌ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి ఓట‌మిని చ‌విచూసింది. ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఈ మ్యాచ్‌ ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. చివ‌రి బంతికి రెండు ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో గుజ‌రాత్ బ్యాట‌ర్ ర‌షీద్ ఖాన్ బౌండ‌రీ బాద‌డంతో ఆర్ఆర్‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచులు ఆడి, నాలుగు విజ‌యాలు న‌మోదు చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లోనూ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

More Telugu News