China: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • సరిహద్దులో అసాధారణ పరిస్థితులను తక్షణమే పరిష్కరించాల్సి ఉందన్న మోదీ
  • ఇరుదేశాల బంధాలు ప్రపంచానికి కూడా కీలకమని వ్యాఖ్య
  • సంప్రదింపుల ద్వారా సాధారణ పరిస్థితులను నెలకొల్పవచ్చునని మోదీ ఆశాభావం
PM Modi said that India and China Border Situation needs to be Addressed Urgently

సరిహద్దులో అస్థిరత కారణంగా భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు సన్నగిల్లిన పరిస్థితులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన సంబంధాలు ఉన్నాయన్నారు. భారత్-చైనా మధ్య సుస్థిర సంబంధాలు ప్రపంచానికి కూడా ఎంతో కీలకమన్నారు.

చైనాతో సంబంధం భారత్‌కు కీలకమని, ఎంతో ప్రాధాన్యమని అన్నారు. సరిహద్దులో సుదీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితులను తక్షణమే పరిష్కరించాల్సి ఉందని, తద్వారా ద్వైపాక్షిక బంధాల్లో నెలకొన్న అసహజ పరిస్థితులను పరిష్కరించవచ్చని తాను భావిస్తున్నట్టు మోదీ అభిప్రాయపడ్డారు. సానుకూల చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సరిహద్దులో సాధారణ స్థితిని పునరుద్ధరించగలవని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ‘యూఎస్ న్యూస్‌వీక్’ అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కీలకమన్నారు. దౌత్య, మిలిటరీ స్థాయిల్లో సానుకూల, నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చల ద్వారా  బంధాలను పునరుద్ధరించగలమని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

కాగా2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరుదేశాల సంబంధాలు సంధిగ్దంలో పడ్డాయి. నాటి ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా.. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

More Telugu News